రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
– ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
– పరీక్షలకు హాజరుకానున్న 2500 మంది విద్యార్థులు

తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రేపటినుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకోసం తాండూరులో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు పరీక్షా కేంద్రాలు, సింధు బాలికల జూనియర్ కళాశాల, అంబేద్కర్ కాలేజీ, సిద్దార్థ జూనియర్ కళాశాల, చైతన్య జూనియర్ కళాశాలతో పాటు ఈ సారి కొత్తగా ఎన్టీఆర్ కాలనీ సమీపంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్సియల్ బాలికల కళాశాల, హైదరాబాద్ రోడ్డు మార్గంలోని కోకట్ సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాలలో రెండు పరీక్షా కేంద్రాలను
ఏర్పాటు చేశారు.రేపటి నుంచి జరిగే పరీక్షలకు ఆయా సెంటర్లలో 2500 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. ఇప్పటికే ఆయా పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లను పూర్తి చేశారు.
కొవిడ్ నిబంధనలతో..
అన్ని కేంద్రాలలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్ర్కీనింగ్, ప్రథమ చికిత్సకు వైద్యులు, అంబులెన్స్‌లను అందుబాటులో ఉంటాచని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జ్వరం లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని సూచించింది. పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది.


