పోలీసు శాఖ ప్రతిష్ట పెంచేలా విధులు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పోలీసు శాఖ ప్రతిష్ట పెంచేలా విధులు
– గ్రామీణ ప్రాంతాల్లో పోలీసింగ్‌ బలోపేతంపై దృష్టి
– సురక్ష మిత్ర విజయవంతానికి ప్రత్యేక చర్యలు
– వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా
– తాండూరు డీఎస్పీ, రూరల్‌ కార్యాలయలలో తనిఖీలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పోలీసు శాఖ ప్రతిష్ట పెంచేలా ప్రతి ఒక్క పోలీసు అధికారి విధులు నిర్వహించాలని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా అన్నారు.

మంగళవారం వార్షిక తనిఖీలలో భాగంగా తాండూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం, తాండూరు రూరల్ సర్కిల్ కార్యాలయాలను ఆమె సందర్శించారు. ముందుగా డీఎస్పీ కార్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఆయా కార్యాలయాలలో పరిశుభ్రత, నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయాలలో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, కేసు ఫైళ్లు, పరిపాలనా పత్రాలు, స్టేషన్ వారీ రిజిస్టర్లను, అధికారిక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ స్నేహా మెహ్రా మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించి, దర్యాప్తులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రికార్డులను మరింత సమర్థవంతంగా.. పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోలీసు శాఖ ప్రతిష్టను పెంపొందించే విధంగా వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణ మరియు ప్రజాసేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని అందరికీ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి అమలు చేస్తున్న వీపీఓ(విలేజ్ పోలీస్ ఆఫీసర్) వ్యవస్థను మరింత ప్రభావవంతంగా రూపొందించనున్నట్లు తెలిపారు.

గ్రామ స్థాయిలో సమాచార సేకరణ, నేర నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారం మరియు పోలీసు-ప్రజల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో వీపీఓ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా సురక్ష మిత్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలు మరియు చిన్నారుల రక్షణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత వంటి అంశాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

అంతకుముందు తనిఖీ సందర్భంగా సిబ్బంది టర్నౌట్‌ను కూడా పరిశీలించిన ఎస్పీ.. అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో, చక్కటి టర్నౌట్‌తో విధులు నిర్వహిస్తున్నందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, తాండూర్ రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్‌ఐలు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అర్ధరాత్రి దాటాక ఆలయంలో చోరీ