‘డబుల్’ రగడ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

‘డబుల్’ రగడ..!
– లబ్దిదారుల ఎంపికపై బీఆర్ఎస్ ఆగ్రహం
– అనర్హులకు ఇండ్లను అమ్ముకుంటున్నారని మండిపాటు
– ఎమ్మెల్యేను అడ్డుకున్న నేతలు, కౌన్సిలర్లు
– కాలనీ వాసులతో బైటాయించిన కౌన్సిలర్ జావిద్
– పోలీసులు, ఆందోళనకారుల మద్య తోపులాట
– గందరగోళం మద్య ఎంపిక కార్యక్రమం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌ రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కార్యక్రమంలో రగడ నెలకొంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నేతలు కార్యక్రమంపై ఆందోళనకు దిగారు.

లబ్దిదారులతో కలిసి బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, ప్రత్యేక బలగాల భారీ బందోబస్తు మద్య కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చింది. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ కౌన్సిలర్లు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టణంలోని 8వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ జావిద్ తన వార్డు రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలకు చెందిన ప్రజలతో కలిసి ర్యాలీగా వచ్చారు.

గమనించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కౌన్సిలర్ జావిద్ కాలనీ వాసులతో కలిసి మున్సిపల్ ముందు బైటాయించారు. జావిద్‌తో పాటు ప్రజలు డబుల్ బెడ్‌ రూం ఇళ్ల ఎంపికలో అక్రమాలు చేస్తున్నారని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అర్హులైన తమకు ఇళ్లను కేటాయించడం లేదని మండిపడ్డారు. జావిద్‌తో పాటు ప్రజలతో పోలీసుల మద్య తోపులాట జరిగి పెద్ద రభస చోటు చేసుకుంది. కౌన్సిలర్ జావిద్‌ను, ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎట్టకేలకు పోలీసులు కౌన్సిలర్ జావిద్‌ను తప్పించి.. ప్రజలను లోపలికి ఆహ్వానించారు.

మరోవైపు కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నేతలు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా కార్యక్రమ వేధిక వద్దకు వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చొచ్చుకునేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లారు. కొద్ది సేపు నినాదాలతో ఉద్రిక్తత కొనసాగింది. ఆందోళన మద్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, నాయకులు సంతోష్ గౌడ్, కౌన్సిలర్లు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హాయంలో కట్టించిన ఇళ్లను కాంగ్రెస్ నేతలు అనర్హులకు పంపిణీ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు తమకు అనుకూలమైన వారికి ఇండ్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దీంతో అర్హులైన పేదలకు ఇండ్లు అందడం లేదని అన్నారు. అంతేకాకుండా డబుల్‌ బెడ్ ఇండ్ల వద్ద ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా హడావుడిగా లబ్దిదారులను ఎలా ఎంపిక చేస్తారని నిలదీశారు. డబుల్ బెడ్‌ ఇండ్ల పంపీణిలో అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని, మరింత ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

పొరపాట్లు లేకుండా సర్ పూర్తి చేయాలి