తాండూరులో డ్రోన్‌ సర్వేకు ముహుర్తం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో డ్రోన్‌ సర్వేకు ముహుర్తం..!
– నేటి నుంచి పట్టణంలో మాస్టర్ ప్లాన్‌కు శ్రీకారం
– ప్రత్యేక బృందంతో వారం రోజుల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు మున్సిపల్‌ను అభివృద్దిలో కొత్త పుంతలు తొక్కించే సమయం ఆసన్నమైంది. అమృత్‌ 2.0లో భాగంగా తాండూరు మున్సిపల్ మాస్టర్ ప్లాన్‌ అమలు సర్వేకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మున్సిపల్‌లో ఈనెల 28న డ్రోన్‌ సర్వే ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది. మంగళవారం నుంచి పట్టణంలో డ్రోన్‌ సర్వే నిర్వహించేందుకు అధికారులు ముహుర్తం ఖరారు చేశారు. డీటీసీపీ, సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో మంగళవారం సర్వే ప్రారంభించనున్నారు. వారం రోజుల పాటు పట్టణంలో డ్రోన్ సర్వే కొనసాగుతుంది.

ముఖ్యంగా ఈ సర్వేలో రాబోయే 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఉపయోగపడేలా ప్లాన్‌ను తయారు చేస్తున్నారు. డ్రోన్‌ సర్వేలో మున్సిపాలిటీ ఉపరితలం ఎత్తు, చెరువులు, వాగులు, డ్రైనేజీ, ఇళ్లు, చెట్లు, రోడ్లు, వైకుంఠదామాలు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, మార్కెట్లు, సెల్‌ టవర్లు, మరుగుదొడ్లు, వాటర్‌ ట్యాంకులు, రిజర్వాయర్లు తదితర వనరులన్నింటినీ మ్యాపింగ్‌ చేస్తారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా తయారు చేయబోయే మాస్టర్ ప్లాన్‌కు ఈ డిజిటల్‌ సర్వే ఉపయోగపడనుంది. భవిషత్‌లో మున్సిపాలిటీల్లో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు, అభివృద్ధికి కూడా ఈ డిజిటల్‌ సర్వే పరిష్కారం చూపతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇదికూడా చదవండి…

ఇంట్లో టపాసుల మంట..!