ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు…!
– విద్యార్థులకు కలిసొచ్చిన 5 నిమిషాలు రూల్
– అయినా తొలిరోజు 46 మంది గైర్హాజరు
– పరీక్షా కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈసారి ఒక్క నిమిషం నిబంధనను నిషేధించి 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ రూల్ అమలు చేయడంతో విద్యార్థులు సమయానికి చేరుకున్నారు. ఈ నిబంధనతో విద్యార్థులకు ఎలాంటి ఆలస్యం జరిగిన సంఘటనలు కనిపించలేదు.

ఇంటర్ పరీక్షల సందర్భంగా పట్టణంలో 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జనరల్‌కు సంబంధించి తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2, భాష్యం కాలేజీ, సింధు బాలికల జూనియర్ కాలేజీ, సిద్దార్థ జూనియర్ కాలేజీలతో పాటు ఒకేషనల్ విభాగంలో హైదరాబాద్ రోడ్డు మార్గంలోని టీఎంఆర్జేసీ, టీఎస్ డబ్ల్యూఆర్ కాలేజీలను కేటాయించారు. తొలిరోజు జనరల్లో 1743 మంది వి ద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 37 మంది గైర్హాజరుతో 1706 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఓకేషనల్ విభాగంలో 593 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 09 మంది గైర్హాజరుతో 584 మంది పరీక్షలు రాశారు. మొత్తంగా మొదటి రోజు 2336 మందిలో 46 మంది గైర్హాజరుతో 2290 మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరిగిందని కస్టోడీయన్లు కృష్ణయ్య, కిష్టప్పలు ఓ ప్రకటనలో తెలిపారు. అంతకుముందు తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పట్టణ సీఐ సంతోష్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద ఎస్ఐ ర్యాంకు అధికారులు, సిబ్బందిని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పరీక్షలు ప్రశాంతగా జరిగేలా 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఇదికూడా చదవండి…

