కొంగొత్త పాలనకు వేళాయే..!
– 15 నుంచి కొత్త మున్సిపల్ నుంచి పరిపాలన
– పాత మున్సిల్ నుంచి విభాగాల తరలింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి: గత రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉండిపోయిన కొత్త మున్సిపల్ భవనాన్ని ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్త మున్సిపల్ నుంచి పరిపాలన ఎప్పుడెప్పుడా అని అందరు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కొత్త మున్సిపల్ నుంచి పరిపాలన అందించేందుకు అధికార యంత్రాంగం దృష్టిసారించింది. ఇందులో భాగంగా పాత మున్సిపల్ నుంచి ఒక్కో విభాగం కొత్త మున్సిపల్‌కు తరలివెళుతోంది. ఇప్పటికే ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాలు తరలివెల్లాయి. శనివారం నాటికి మిగతా అకౌంటెంట్ విభాగం, రెవెన్యూ, ఎస్టాబ్లిస్‌మెంట్, టౌన్ విభాగాలను తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే సోమవారం నుంచి కొత్త మున్సిపల్ నుంచి అన్ని విభాగాలతో కొంగొత్త పాలన అందిస్తామని ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ తెలిపారు. కొత్త మున్సిపల్‌లో అన్ని సౌకర్యాలు, సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. అందుబాటులో ఉన్న వసతులతో కార్యకలాపాలను కొనసాగిస్తామని, ఇంకా అవసరమైన కొత్త ఫర్నిచర్ కోసం ప్రతిపాధనలు సిద్దం చేయడం జరుగుతుందని వెల్లడించారు. అదేవిధంగా మున్సిపల్ ముందు సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, ఇతర పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు రూ. 1.4 కోట్లతో ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు.


