కోట్‌పల్లి ప్రాజెక్టుకి రాజయోగం..!
– ప్రాజెక్టు మరమ్మత్తులకు రూ.90 కోట్లు
– నిధుల మంజూరుపై జీవో విడుదల
– త్వరలో కెనాళ్ల మరమ్మత్తులకు టెండర్లు
– జుంటుపల్లి ప్రాజెక్టుకు కూడా మహర్దశ పట్టిస్తాం
– తాండూరు, వికారాబాద్ రోడ్డుకు కొత్త టెండర్లు
– మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కోట్ పల్లి ప్రాజెక్టుకు రాజయోగం రాబోతోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహాకారంతో కోట్ పల్లి ప్రాజెక్టుకు నిధులు మంజూరు కావడం జరిగిందని, ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలిపారు. రూ.90 కోట్ల నిధులు మంజూరు అయినట్లు వెల్లడించారు. గతంలో ఉన్న పాలకులు కోట్ పల్లి ప్రాజెక్టు అభివృద్ధిని విస్మరించారని అన్నారు. మర్రి చెన్నారెడ్డి కాలంలో మాదిరిగా కాంగ్రెస్ హయాంలో కోట్ పల్లి ప్రాజెక్టును అభివృద్ధి పరుస్తామన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 90 కోట్ల నిధులతో ప్రాజెక్టు కెనాళ్ల మరమ్మత్తులు చేయిస్తామన్నారు. త్వరలోనే టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభిస్తామన్నారు. పనులు పూర్తి అయితే ప్రాజెక్టు పరిధిలోని పెద్దేముల్ మండలంలో ఉన్న దాదాపు 9400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని అన్నారు. ఈ పనులు పూర్తయితే దాదాపు 35 ఏండ్ల కళ నెరవేరుతుందని అన్నారు. ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

అదేవిధంగా జుంటుపల్లి ప్రాజెక్టుకు కూడా నిధులు రూ. 8కోట్ల నిధులు మంజూరు కావడం జరిగిందని.. ప్రాజెక్టులోని కెనాళ్లను అభివృద్ధి పరిచి 4500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తామన్నారు. దీంతో పాటు చిలుకవాగు అభివృద్ధి పనులు చేయిస్తున్నామన్నారు. గొల్ల చెరువుతో మురుగునీరు మల్లింపు చర్యలు చేపడుతున్నామన్నారు. గొల్ల చెరువులో కబ్జాలపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో పాటు అగ్గనూర్ నుంచి బషీరాబాద్ వరకు, బండమీదిపల్లి నుంచి రుద్రారం, నీళ్లపల్లి, ఇస్మాయిపూర్, మైల్వార్ వరకు, బషీరాబాద్ నుంచి కరణ్ కోట్ వరకు రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. కోడంగల్, గౌతాపూర్ మార్గంలోని జాతీయ రోడ్డు అనుసంధానం రోడ్డుకు రూ.35 కోట్ల నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలోనే కోడంగల్ రోడ్డు మార్గంలోని చిలుక వాగు బ్రిడ్జి పనులు జరుగుతున్నాయన్నారు. తాండూరు వికారాబాద్ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని గుర్తుచేశారు. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ లెస్ వేయడంతో పనులు ఆగిపోయిడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఆ కాంట్రాక్టును రద్దు చేసి కొత్త ఏజేన్సీ ద్వారా మళ్లీ టెండర్లు ఆహ్వానించడం పాటు కొత్త పైపులైన్ మంజూరు కోసం ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. అమృత్ 2 కింద పట్టణంలోని శివారు, వీలీన కాలనీలలో తాగునీటి ట్యాంకుల నిర్మాణం చేపట్టేందుకు దృష్టి సారించడం జరుగుతుందన్నారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగు పరిచేందుకు రూ. 27 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. రెండో దశలో రూ.15-20 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి స హాకారంతో టాటా కన్సల్ టెన్సీ ద్వారా తాండూరుకు అడ్వాన్సు టెక్నాలజీ కాలేజీ, దౌల్తాబాద్ వద్ద రూ.200 కోట్లతో ఇంటిగ్రేటేడ్ స్కూల్ చేపట్టడం జరుగుతుందన్నారు. వచ్చే నెలలో శంకుస్థాపనలు చేయిస్తామన్నారు. అదేవిధంగా త్వరలోనే తాండూరు మార్కెట్ యార్డును తరలించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. నాలుగు జిల్లాలోనే ఆదర్శవంత మార్కెట్ యార్డును నిర్మించేందుకు సీఎం సహాకారంతో నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామిలను నెరవేర్చడం జరుగుతుందని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ కు సంఘీభావం
కాశ్మీర్ లోని పహెల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేసిన ఆపరేషన్ సిందూర్ కు సంఘీభావం తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. పార్టీలకతంగా ప్రతి ఒక్కరు భారత సైన్యాన్ని అండగా నిలవాలని అన్నారు. సైన్యానికి పార్టీలకతీతంగా వెంబడి నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, నాయకులు డా. సంపత్ కుమార్, గాజీపూర్ నారాయణ రెడ్డి, లొంక నర్సింలు, మార్కెట్ కమిటి డైరెక్టర్ ఉదయ్ భాస్కర్, బంటు వేణుగోపాల్, రొంపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

