బర్త్‌డే పార్టీ కోసం వెళ్లిన ఫ్రెండ్స్..!
– మిస్టరీగా స్నేహితుడి మరణం
– వెంట తీసుకెళ్లి హత్య చేసినట్లు అనుమానం
– కర్ణాటక సేడం రైల్వే పట్టాలపై డెడ్ బాడీ గుర్తింపు
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : బర్త్ డే పార్టీ కలిసిన వెళ్లిన స్నేహితుల్లో ఒకరు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. వెంట తీసుకెళ్లిన స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బషీరాబాద్ మండలానికి చెందిన బాలుడు కర్ణాటక రాష్ట్రం సేడం రైల్వే పట్టాలపై శవమై కనిపించడంతో ఈ సంఘటన బషీరాబాద్ మండలంలో కలకలం రేపుతోంది.

ప్రాథమిక సమాచారం మేరకు బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామానికి చెందిన అంజమ్మ కుమారుడు శాంతు పదో తరగతి పరీక్షలు రాసి ఇంటివద్దే ఉంటున్నాడు. తండ్రి మునియప్ప ఇటీవలే మరణించాడు. అదే గ్రామానికి చెందిన అతని ఇద్దరు స్నేహితులు, అదే మండలం కంసాన్‌పల్లికి చెందిన మరో ఇద్దరు స్నేహితులు హస్నాబాద్‌లో బర్త్ డే పార్టీ చేసుకుందామని మంగళవారం రాత్రి కలిసి వెళ్లారు. అయితే బుధవారం ఉదయం బషీరాబాద్ కర్ణాటక రాష్ట్రం సేడం మార్గంలోని రైల్వే పట్టాలపై శాంతు డెడ్ బాడిని రైల్వే పోలీసులు గుర్తించారు.

బర్త్ డే పార్టీ పేరుతో వెంట తీసుకెళ్లిన స్నేహితులే శాంతును హత్య చేసి ఉంటారని, రైల్వే ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని రైల్వే పట్టాలపై పడేసి ఉంటారని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సేడం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు బాలుడు తల్లి అంజమ్మ ఉన్న తన ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో బోరున విలిపించింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదికూడా చదవండి…

