జంటుపల్లి వాసులతో డిప్యూటీ సీఎం దోస్తానా..!
– మాజీ ఎంపీపీ కుమారులతో కలిసి విద్యాభ్యాసం
– వారి కుటుంబంతో భట్టి విక్రమార్కకు అనుబంధం
– అందుకే ఆ ఫ్యామిలీ మీట్‌కి స్పెషల్ టైం ఇచ్చిన భట్టి
– గ్రామం, దేవాలయ అభివృద్ధి వరాలపై ఆశలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని జుంటుపల్లి వాసులతో దోస్తీ ఉన్నట్లు గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు. మంగళవారం యాలాల మండలంలోని జుంటుపల్లి రామస్వామిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దర్శించుకోనున్న సంగతి తెలిసిందే.

అయితే కేవలం రామస్వామి దర్శనానికి కాకుండా తన ప్రాణ స్నేహితులను కలుసుకునేందుకు వస్తున్నారని తెలిసింది. జుంటుపల్లి గ్రామానికి చెందిన జమిందర్ కుటుంబానికి చెందిన వ్యక్తులతో డీప్యూటీ సీఎం ఏళ్లపాటు స్నేహం చేసి.. కలిసి విద్యాభాసం చేసినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. యాలాల మండలం జుంటుపల్లిలో జమిందర్ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కుటుంబం నుంచి జంటుపల్లి రామస్వామి దేవాలయ నిర్వహణ బాధ్యతలు చేపడుతున్నారు.

ఈ కుటుంబంలో జమిందర్ సుమిత్రాదేవి యాలాల మండలానికి గతంలో ఎంపీపీగా, జెడ్పీటీసీగా సేవలందించారు. ఆమె కుమారులు డా.రవిందర్ రావు, శ్యాంసుందర్ రావుతో పాటు రాఘవేందర్ రావులు హైదరాబాద్‌లో చదువుకుంటున్న సమయంలో భట్టి విక్రమార్కతో స్నేహ బంధం ఏర్పడింది. వీరందరు కలిసి హైదరాబాద్‌లో ఇంటర్, డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. అప్పట్లో భట్టి విక్రమార్క హాస్టల్ లో ఉండగా వీరి కుటుంబంతోనే కలిసి ఉండేవారని స్నేహితులు చెబుతున్నారు. వారి అమ్మ సుమిత్రాదేవి వారితో పాటు భట్టి విక్రమార్కకు కూడా వంటలు చేసి భోజనం అందించేదని చెబుతున్నారు. సుమిత్రాదేవి అప్పట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయగా భట్టి విక్రమార్క యాలాలకు వచ్చి ఆమె తరుపున ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు.

ఇన్నేళ్లు గడిచినా భట్టి విక్రమార్క తన స్నేహాన్ని మరువలేదని స్నేహితులు పేర్కొంటున్నారు. ఒక విధంగా జుంటుపల్లి రామ స్వామి దర్శనంతో పాటు తమ కుటుంబాన్ని కలిసేందుకే భట్టి విక్రమార్క జుంటుపల్లికి వస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
డీప్యూటీ సీఎం వరాలపై ఆశలు
మరోవైపు జుంటుపల్లి రామస్వామి దేవాలయానికి వస్తున్న డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాకపై గ్రామస్తులు, మండల ప్రజలు ఆశలు పెంచుకున్నారు. జుంటుపల్లి రామస్వామి దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తారని ఆశిస్తున్నారు. దీంతో పాటు గ్రామాభివృద్ధికి కూడా వరాలు ఇస్తారని ఆకాంక్షిస్తున్నారు. జుంటుపల్లికి చెందిన ఢిఫ్యూటీ సీఎం స్నేహితులు కూడా ఇదే ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇదికూడా చదవండి..

