ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
– తాండూరులో తొలిరోజు 57 మంది గైర్హాజరు
– పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో మొత్తం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. ఉదయం 8-30గంటలకే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.

ఈసారి 1 నిమిషం నిబంధన ఎత్తివేసి 5నిమిషాల ఆలస్యంకు అనుమతి ఇవ్వడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదు. విద్యార్థులు నిర్ణీత సమయానికంటే ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న రెండు పరీక్షా కేంద్రాల వద్ద ఓ ముగ్గురు విద్యార్థులు తడబాటుకు గురయ్యారు. ఒక పరీక్షా కేంద్రానికి బదులు మరో కేంద్రానికి వచ్చి ఇబ్బంది పడ్డారు. కేంద్రం వద్ద ఉన్న బలరాం అనే కానిస్టేబుల్‌తో పాటు స్థానికులు విద్యార్థినిలను సరైన పరీక్షా కేంద్రంకు తరలించారు.

సమయానికంటే ముందే విద్యార్థులు కేంద్రానికి చేరుకుని పరీక్షకు హాజరయ్యారు. అదేవిధంగా మొదటి రోజు 2553 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 57 మంది గైర్హాజరు అయినట్లు కస్టోడియన్లు మల్లినాథప్ప, ఆర్.కృష్ణయ్యలు తెలిపారు. మిగతా 2496 మంది పరీక్షలు రాసినట్లు తెలిపారు. జనరల్ విభాగంలో 1969 మందికి 33 మంది గైర్హాజరుతో 1936 మంది పరీక్షలు రాయగా ఒకేషనల్ విభాగంలో 584 మందికి 24 మంది గైర్హాజరుతో 560 మంది పరీక్షలు రాసినట్లు వెల్లడించారు. మరోవైపు తాండూరులోని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 114 సెక్షన్ అమల్లో ఉండడంతో జిరాక్స్ దుకాణాలను మూసి వేయించారు.


