పొర్లు దండాలు పెట్టిన కార్యకర్త సస్పెండ్
– పార్టీ వ్యతిరేక విధానంపై చర్య
– సభ్యత్వం కూడ రద్దు : మండల పార్టీ అధ్యక్షులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రాంతంలో రోడ్లు, కాలుష్య సమస్యలను పరిష్కరించాలని పొర్లుదండాలు పెట్టి నిరసన చేపట్టిన టీఆర్ఎస్ కార్యకర్త అంబ్రేష్‌పై పార్టీ నేతలు చర్యలు తీసుకున్నారు. గత రెండు రోజుల క్రితం తాండూరు మండలం అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్‌కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త బోయిని అంబ్రేష్ అంతారం సమీపంలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి పొర్లు దండాలు పెడుతూ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అంబ్రేష్ ప్రభుత్వానికి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా వాఖ్యలు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన తాండూరు మండల పార్టీ అధ్యక్షులు రాందాస్, కార్యదర్శి నరేందర్ రెడ్డిలు అతనిపై చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఆయనను పార్టీ నుంచి తొలగించినట్లు, పార్టీ సభ్యత్వాన్ని కూడ రద్దు చేసినట్లు ఓ ప్రకటనలో ప్రకటించారు. పార్టీ కార్యక్రమాలకు ఆయనను ఆహ్వానించరాదని తెలిపారు. పార్టీలో ఎవరైనా వ్యతిరేక విధానాలకు పాల్పడితే ఎంతటి వారిపైనైనా పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు చర్యలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.


