తాండూరులో మరో ఫోక్సో కేసు
– ప్రేమ పేరుతో బాలికను లోబర్చుకున్న యువకుడు
– పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం
– పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంభీకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పోలీస్టేషన్ పరిధిలో మరో ఫోక్సో కేసు నమోదయ్యింది. బాలికను కిడ్నాప్ చేసి.. అసభ్యంగా ప్రవర్తించిన యూపి యువకుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో యువకుడు బాలికను ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన యువకుడిపై పోలీసులు మరో కొత్త ఫోక్సో కేసును నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రస్తుతం తాండూరు పట్టణంలో నివాసం ఉంటోంది.

ఆమెకు బంధువైన తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన శివకుమార్‌తో పరిచయం ఏర్పడింది. శివకుమార్ బాలికను ప్రేమిస్తున్నానని మాయ మాటలతో లోబరుచుకున్నాడు. అంతేకాకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భవతి కావడంతో కుటుంబ సభ్యులు గమనించి నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మైనర్ బాలిక తల్లి, ఆదివారం రాత్రి తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడు శివకుమార్‌పై అత్యాచారంతో పాటు బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని సోమవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.


