రోహిత్ రెడ్డి సస్పెన్షన్ అబద్దమా..?
– కేటీఆర్ మాటలకు విలువే లేదా
– బీఆర్‌ఎస్ పార్టీ తీరు అయోమయం
– కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ నుంచి రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగిందని కేటీఆర్ చెప్పిన మాటలు అబద్దమేనా..? అన్నట్లుగా పరిణాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు అన్నారు.

డ్రగ్స్ కేసులో నిందితుడిగా మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నను లేవనెత్తగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మీడియా సమావేశంలో రోహిత్ రెడ్డిని గతంలోనే పార్టీ నుండి సస్పెండ్ చేశామని బదులిచ్చారనే విషయాన్ని గుర్తుచేశారు.

అయితే సోమవారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువాతో పాల్గొనడం చూస్తే, కేటిఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో చెప్పిన మాటకు విలువ లేదో, లేక ఆయన మాటను పార్టీ నాయకులే లెక్కచేయడం లేదో అర్థం కావడం లేదని అన్నారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. రోహిత్ రెడ్డిని నిజంగానే సస్పెండ్ చేసి ఉంటే ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారని, ఒకవేళ సస్పెండ్ చేయకపోతే కేటిఆర్ చెప్పిన మాటలు అబద్ధమని స్వయంగా ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి అంశాలపై ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు, ఆరోపణలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు సాగుతుంటే, దాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని అన్నారు.


