ఘనంగా బక్రీద్..!
– సామూహిక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు
– వేడుకలలో పాల్గొన్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
– శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారానికి ప్రతిరూపకంగా నిలిచే బక్రీద్ వేడుకలు తాండూరులో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు.

పండగ సందర్భంగా గురువారం ఉదయం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఈద్గా మైదానంతో పాటు చెన్‌గెష్‌పూర్ రోడ్డు మార్గంలోని ప్రధాన ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేశారు. తాండూరులో జరిగిన బక్రీద్ పండగ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా పాల్గొని ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ముస్లిం సోదరులు కూడా చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, నేతలను ఆలింగనం చేసుకుని సామరస్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మానవాళిని జాగృతపరచి, మనలోని త్యాగనిరతిని చాటిచెప్పే పవిత్రమైన ఈ బక్రీద్ వేడుకను జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సమాజంలో సామరస్యాన్ని పెంపొందించాలని, శాంతిని నెలకొల్పాలని ఆకాంక్షించారు. మరోవైపు బక్రీద్ వేడుకల్లో బందోబస్తును వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా హాజరై సమీక్షించారు.

ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తంరావు, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, బీసీ కమీషన్ మాజీ మెంబర్ శుభప్రద్ పటేల్, జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రవూఫ్, అఫ్పూ(నయూం), ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, బీఆర్ఎస్ తాండూరు ఇంచార్జ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు ముస్లిం సోదరులు పండుగకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన వంటకాలు బిర్యానీ, శీర్ ఖుర్మా, మటన్ కబాబ్‌లు ఒకరికొకరు పంచుకుని సంతోషంగా పండగను జరుపుకున్నారు.


