తాండూరును మోడల్ మున్సిపాల్టీగా మారుద్దాం
– రాజకీయాలకు తావులేకుండా పట్టణ అభివృద్ధి
– అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయం
– ఎస్ఐఆర్లో అందరు భాగస్వాములు కావాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– సాదాసీదాగా మున్సిపపల్ కౌన్సిల్ సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపాల్టీని మోడల్ మున్సిపల్‌గా మార్చేందుకు అందరు బాధ్యతగా పనిచేయాలని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి నీరజ బాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సాధారణ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు పట్టణ అభివృద్ధికి అందరు కౌన్సిలర్లు కృషి చేయాలన్నారు.

ప్రజలకు మంచి చేయడమే మన ఏజెండాగా పెట్టుకొని ముందుకు సాగాలని అన్నారు. కౌన్సిల్ లో ప్రతిపక్షం, స్వపక్షం రెండు తమ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజల పక్షంగా పని చేయాలని అన్నారు. అంతేకాని ఒక వ్యక్తికి, వ్యక్తిగత మేలు జరిగే విధంగా పని చేయరాదని అన్నారు. ఎన్నికల వరకే పార్టీలు ఉండాలని, వ్యక్తిగత, కక్ష సాధింపులు చేసుకోరాదన్నారు. అందరూ సమన్వయంతో పని చేస్తేనే పట్టణ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు.

పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. తాండూరును మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.

అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో ప్రతి కౌన్సిలర్, కో-ఆప్షన్ సభ్యులు తప్పనిసరిగా పాల్గొని, అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్ జాబితాలో ఉండేలా కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ రాకేశ్ రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


