నగరేశ్వరుని ఆశీస్సులు ఎవరికో..?

తాండూరు రాజకీయం వికారాబాద్

నగరేశ్వరుని ఆశీస్సులు ఎవరికో..?
– కత్తి మీద సాముగా దేవాలయ చైర్మన్ ఎంపిక
– పాలక మండలి ఏర్పాటుపై సస్పెన్స్
– తాండూరులో నడుస్తున్న హాట్ టాపిక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయ పాలకవర్గం చైర్మన్ ఎంపిక వ్యవహారం రాజకీయ, సంఘాల మధ్య హాట్‌టాపిక్‌గా మారింది. దేవాలయ చైర్మన్ పదవిని ఎవరికి కట్టబెట్టాలనే అంశంపై వర్గాల మధ్య పోటీ నెలకొనడం ఆసక్తిని రేపుతోంది.

ఒకవైపు పలువురు ఆశావహులు తమ తమ పరిచయాలు, మద్దతు వర్గాలతో రేసులో ముందుకు సాగుతుండగా.. మరోవైపు సంఘంలోని సీనియర్లు మాత్రం ఏకాభిప్రాయంతో ఎంపిక చేయాలని సూచిస్తున్నట్లు సమాచారం.

నాలుగు పేర్లు..
చైర్మన్ పదవి కోసం ప్రస్తుతం ప్రధానంగా నాలుగు పేర్లు తెరపై ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్న కోటాలో ‘కటకం’, వ్యాపారంగానికి చెందిన ‘రొంపల్లి’, వ్యాపార భాగస్వామ్య వర్గం నుంచి ‘ఆర్కే’, మహిళా నాయకులాలు మద్దతులో ‘దేవగారి’ పేర్లు వినిపిస్తున్నాయి.

ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉన్న వర్గాలను సమీకరిస్తుండటంతో ఎంపిక వ్యవహారం మరింత ఉత్కంఠగా మారినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్న వారి మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో చివరకు ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ సాగుతోంది.

ఇదిలా ఉండగా.. నగరేశ్వర దేవాలయ పునర్నిర్మాణం జరుగుతున్న తరుణంలో అనుభవం, సీనియారిటీ ఉన్న వ్యక్తికే చైర్మన్ బాధ్యతలు అప్పగించాలని ఆర్యవైశ్య సంఘంలోని కొందరు పెద్దలు సూచించినట్లు సమాచారం. దేవాలయ అభివృద్ధి పనులు, భక్తుల అవసరాలు, పాలకవర్గ సమన్వయం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని అనుభవజ్ఞుడికి అవకాశం ఇవ్వాలని వారు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సమీకరణాల మధ్య ఓ పోటీదారు మరో వ్యక్తి పేరును తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇప్పటికే ఉన్న పోటీకి కొత్త మలుపు వచ్చినట్లయింది. ఎవరి పేరు అధికారికంగా ఖరారవుతుందనే దానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది.

14న తేలుతుందా.. లేక.. ?
చైర్మన్ ఎంపికపై ప్రస్తుతం జరుగుతున్న చర్చలకు ఈ నెల 14న తెరపడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ రోజు పెద్దల సమక్షంలో చర్చించి ఏకాభిప్రాయంతో ఒక పేరును ఖరారు చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే నాలుగు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే మాత్రం ఎంపిక ప్రక్రియ మరింత కాలం వాయిదా పడే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా వినిపిస్తోంది.

చివరకు సీనియారిటీకి పట్టం కడతారా?
లేక వర్గాల సమీకరణాల్లో కొత్త పేరు తెరపైకి వస్తుందా?
14న ఏకాభిప్రాయం కుదిరి చైర్మన్ ఎంపిక పూర్తవుతుందా?నగరేశ్వర దేవాలయ పాలకవర్గం చైర్మన్ ఎంపిక ఇప్పుడు ఆర్యవైశ్య సంఘంలోనే కాకుండా స్థానికంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ ‘చైర్మన్ రేసు’లో చివరకు విజేత ఎవరు అన్నది వేచి చూడాల్సిందే.

కట్ట మైసమ్మ కృప అందరిపై ఉండాలి