ఫీజు రియంబర్స్ మెంట్ పెండింగ్ పెట్టొద్దు

తాండూరు వికారాబాద్

ఫీజు రియంబర్స్ మెంట్ పెండింగ్ పెట్టొద్దు
– రూ.20 వేలకు పెంచి చెల్లించాలి
– బీసీ సంఘం కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్
– క‌ళాశాలల బంద్ విజ‌య‌వంతం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : విద్యార్థుల ఫీజురియంబర్స్ మెంట్ ఫీజును పెండింగ్ పెట్టకుండా వెంటనే చెల్లించాలని బీసీ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు తాండూరులో కళాశాలల బంద్ నిర్వహించారు. తాండూరు కన్వినర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు పట్టణంలోని అన్ని కళాశాలలను బంద్ విజ‌య‌వంతం అయ్యింది.
విద్యార్థులతో ర్యాలీగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వరకు చేరుకున్నారు. ఫీజు రియంబ‌ర్స్ మెంట్ బిల్లుల పెండింగ్‌పై నిరస‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ఏడేండ్లు పూర్తి చేసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించకుండా జాప్యం చేస్తుందన్నారు. దీని కారణంగా రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులు ఫీజారియంబర్స్ మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఉపాధ్యాయులు, కార్మికులకు వేతనాలు పెంచిన ప్రభుత్వం విద్యార్థుల పట్ల చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్ మెంట్ ను రూ.20 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మరోవైపు తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరైన వసతులు, సౌకర్యాలు లేక విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారని, దీనిపై తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిలు దృష్టిసారించి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, మండలాల అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, లక్ష్మణచారి, బీసీ యువజన నాయకులు రాధాకృష్ణ, పెద్దేముల్ మండల బీసీ యువజన అధ్యక్షులు బాలు, సీనియర్ నాయకులు రాము, జుంటుపల్లి వెంకట్, బస్వరాజు, మతీన్, విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.