మిస్సింగ్ సస్పెన్స్‌కు తెర..!
– వసతిగృహం నుంచి అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభ్యం
– తండ్రి వద్దకు చేరిన విద్యార్థి
తాండూరు, దర్శిని ప్రతినిధి: పెద్దేముల్ మండల వసతిగృహం నుంచి అదృశ్యమైన పదో తరగతి విద్యార్థి అక్షిత్ ఆచూకీ లభించడంతో ఉత్కంఠకు తెరపడింది.

గురువారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిన విద్యార్థి.. శుక్రవారం సాయంత్రం మోమిన్‌పేట్ మండలం మెరుగన్పల్లి వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తించినట్లు సమాచారం. తాండూరు పట్టణంలోని విజయనగర్ కాలనీలో ఉన్న పెద్దేముల్ మండల వసతిగృహంలో అక్షిత్(14) పదో తరగతి చదువుతున్నాడు.

గురువారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో వసతిగృహం నుంచి విద్యార్థి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. హస్టల్ పీడీ తండ్రి భాస్కర్‌తో కలిసి తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శుక్రవారం సాయంత్రం మోమిన్‌పేట్ మండలం మెరుగన్పల్లి వద్ద అక్షిత్ నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని విద్యార్థిని తమ వెంట తీసుకెళ్లారు.

దీంతో ఉదయం నుంచి కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. విద్యార్థి క్షేమంగా తండ్రి వద్దకు చేరడంతో కుటుంబ సభ్యులు, వసతిగృహ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థి వసతిగృహం నుంచి ఎందుకు వెళ్లాడు? మెరుగన్పల్లి వరకు ఎలా చేరుకున్నాడు? అనే అంశాలపై పోలీసుల విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.



