నీటి కటకటపై కన్నెర్ర..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నీటి కటకటపై కన్నెర్ర..!
– ఖాళీ బిందెలతో కందనెల్లి తండా వాసుల నిరసన
– సర్పంచ్ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం
– సెక్రెటరీని భయపెట్టి గ్రామానికి రాకుండా చేశారంటూ ఆరోపణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ పెద్దేముల్ మండలం కందనెల్లి తండా వాసులు రోడ్డెక్కారు. తొమ్మిది రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు.

గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించడంలో సర్పంచ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యపై సర్పంచ్‌ను పలుమార్లు సంప్రదించినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు తెలిపారు.

సమస్యను వివరించేందుకు వార్డు సభ్యులు వెళ్లినప్పుడు దురుసుగా మాట్లాడటంతో పాటు, ‘‘ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి’’ అంటూ దూషిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. గ్రామ పంచాయతీ సెక్రెటరీని కూడా సర్పంచ్ తిట్టి, భయపెట్టడంతో గ్రామానికి రాకుండా చేశారని తండా వాసులు ఆరోపించారు.

మిషన్‌ భగీరథ పైపులైన్‌ పగిలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని గ్రామస్థులు తెలిపారు. వెంటనే పగిలిపోయిన పైపులైన్‌ను మరమ్మతు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కందనెల్లి తండాలో నెలకొన్న తాగునీటి సమస్యపై తాండూరు ఎమ్మెల్యే వెంటనే దృష్టి సారించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. ఎంపీడీవో హామీతో ధర్నా విరమించారు.

శభాష్‌ జావిద్‌ భాయ్‌..!