హెచ్‌ఐవీపై అపోహలు వీడాలి.. అవగాహన పెరగాలి
– డీఎంహెచ్‌వో డా. సుధాకర్ లాల్
– హెచ్‌ఐవీ అవగాహన ప్రచార పోస్టర్ ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : హెచ్‌ఐవీపై అపోహలు వీడి.. అవగాహన పెంచుకోవాలని వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్ఓ) డా.సుధాకర్ లాల్ అన్నారు.

హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణ, పరీక్షలు, చికిత్సపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గురువారం తాండూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్)లో ఎఆర్టీ-సీఎస్సీ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ అవగాహన ప్రచార పోస్టర్‌ను డీఎంహెచ్‌వో డా. సుధాకర్ లాల్ ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నాకో అందుబాటులోకి తీసుకొచ్చిన సెల్ఫ్ రిస్క్ అసెస్‌మెంట్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా హెచ్‌ఐవీ సంక్రమణ ప్రమాద స్థాయిని స్వయంగా అంచనా వేసుకోవచ్చని తెలిపారు. అవసరమైతే పరీక్షా కేంద్రాల వివరాలు, ఆరోగ్య సలహాలను కూడా పొందవచ్చన్నారు.

హెచ్‌ఐవీపై అపోహలను తొలగించి, పరీక్షలు, ఎఆర్టీ చికిత్సపై సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలన్నారు. చికిత్స పొందుతున్న వారు మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డా. విద్య, జీజీహెచ్ ఆర్‌ఎంవో డా. సునీల్, దిశ అధికారులు నరేందర్, రమేష్, ఎఆర్టీసీ మెడికల్ ఆఫీసర్, ఎన్‌ఏసీపీ సిబ్బంది పాల్గొన్నారు.


