ఎన్నికలకు సిద్ధమైన తాండూరు ఆర్టీసీ..
– ఎనిమిదేళ్ల తర్వాత యూనియన్ ఎన్నికలు
– అక్టోబర్ 9న పోలింగ్.. 17న ఫలితాలు
– ఎన్నికల కసరత్తులో కార్మిక సంఘాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో తాండూరు డిపోలోనూ ఎన్నికల సందడి మొదలైంది. ఎనిమిదేళ్ల తర్వాత యూనియన్ ఎన్నికలు జరగనుండటంతో కార్మిక సంఘాలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.

ఇప్పటికే ఆయా సంఘాల నాయకులు ఉద్యోగులను కలుస్తూ మద్దతు కూడగట్టేందుకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు అక్టోబర్ 9న పోలింగ్ నిర్వహించనున్నారు.

14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించి, అక్టోబర్ 17న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. దీంతో తాండూరు డిపోలో ఎన్నికల వాతావరణం నెలకొంది. తాండూరు డిపో పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలు, హక్కులు, ఉద్యోగ భద్రత, పని పరిస్థితులు తదితర అంశాలను ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో రానున్న రోజుల్లో వివిధ కార్మిక సంఘాల ప్రచారం మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో తాండూరు డిపో ఉద్యోగుల్లోనూ ఆసక్తి నెలకొంది.


