తాండూరు మున్సిపాలిటీకి కొత్త రూపు
– మాస్టర్ ప్లాన్ 2050 ఏర్పాటుకు కసరత్తు
– 26 నుంచి పట్టణంలో డిజిటల్ డ్రోన్ సర్వే
– పరిశీలించిన ఆర్డీడీ నర్సంహా రెడ్డి
– చైర్ పర్సన్, కమీషనర్ లతో సమీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు మున్సిపల్ కు కొత్త రూపు రాబోతోంది. పట్టణంలోని ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ లో కొత్త మాస్టర్ ప్లాన్- 2050ను అమలు చేయబోతున్నారు. వచ్చే 25 ఏండ్లకు సరిపడా వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయబోతున్నారు. ఇందులో భాగంగా శనివారం మున్సిపల్ రీజీనల్ డిప్యూటీ డైరెక్టర్ (ఆర్డీడీ) నర్సింహారెడ్డి తాండూరు మున్సిపల్ ను సందర్శించారు. మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిలతో కలిసి మాస్టర్ ప్లాన్ అమలుపై చర్చించారు.
మాస్టర్ ప్లాన్ అమలు కోసం సర్వే ఆఫ్ ఇండియా, డీటీసీపీ అధికారుల పర్యవేక్షలో ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ఆర్డీడీ నర్సింహారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాబోయే 25 ఏండ్లకు సరిపడా వసతులు కల్పించే విధంగా మాస్టర్ ప్లాన్ ఉంటోందని తెలిపారు. ఇందుకోసం ఈనెల 26నుంచి పట్టణంలో డిజిటల్ సర్వేకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఈ సర్వేలో ప్రాంతాల వారిగా ఎత్తులు పల్లాలు, రోడ్లు, భవనాలు, డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు, సెల్ టవర్లు, మరుగుదొడ్లు, రిజార్వాయర్లు, మార్కెట్ దుకాణాలు వంటి తదితర అంశాలను సర్వే చేస్తున్నట్లు వివరించారు. వీటి ఆధారంగా మాస్టర్ ప్లాన్ సిద్దం చేయడం జరుగుతుందన్నారు. ఆరు నెలల్లో పక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ సిద్దమైతే తాండూరు మున్సిపల్ కు కొత్త రూపుతో పాటు అభివృద్ధి జరుగుతుందన్నారు.
మున్సిపల్ లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి : చైర్ పర్సన్
తాండూరు మున్సిపల్ లో జరిగిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆర్డీడీ నర్సింహారెడ్డిని చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కొ రారు. పట్టణంలో అనుమతులు లేకుండా అనేక అక్రమ నిర్మాణాలు జరిగాయని, ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురయ్యాయని చైర్ పర్సన్ ఆర్డీడీ దృష్టికి తీసుకవచ్చారు. ఒకటి రెండు అక్రమ నిర్మాణాలపై తానే స్వయంగా ఫిర్యాదు చేయడం జరిగిందని గుర్తుచేశారు. ఇందుకు ఆర్డీడీ నర్సింహారెడ్డి స్పందించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో పాటు రీజియన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న ఎస్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ సత్యభామ, ప్రసీద, కరుణాకర్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవడి…

