పోషకాల ఘని సీతాఫలం
– రోజూ తీసుకుంటే రక్తపోటు దూరం
– బరువు తగ్గాలనుకునే వారికి దివ్య ఔషదం
తాండూరు, దర్శని ప్రతినిధి : శీతాకాలం పండుగా పరిగణించే సీతాఫలం పోషకాల సమాహారం. కొన్ని రకాల అనారోగ్యాల నివారణి. వర్షాకాలంలో వినాయక చవితి నుండి విరివిగా లభించే ఈ సీతాఫలం ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అందుకే దీనిని విటమిన్లు, ఖనిజాలు కలిగిన పోషకాల ఘని అంటారు. ఇది కంటి చూపును, జుట్టుని, మెదడు పనితీరు మెరుగుపర్చడంలో ఉపయోగపడుతుంది. సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్ మెరుగుపరిచి రక్తహీనతను నివారించగలదు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి పుష్కలంగా ఉంటాయి. సీతాఫలం అల్సర్లను నయం చేయడంలోనూ, అసిడిటీని నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే సూక్ష్మపోషకాలు మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి.
బరువు తగ్గాలనుకునే వారికి సీతాఫలం మంచి ఔషధంగా పనిచేస్తుంది. కాకపొతే, ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది కనుక మోతాదుకి మించి సీతాఫలాలు తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక క్యాలరీలు కలిగిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గడేమో కానీ మళ్లీ అధిక బరువు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. ఇక ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అదేవిధంగా సీతాఫలంలోని బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసియోజెనిక్, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. సీతాఫలం గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా సీతాఫలం తినవచ్చు.
