చోరీకి టార్గెట్.. సూపర్ మార్కెట్..!
– రూ.1.25 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
– సీసీ కెమెరాలో కదలికలు.. నమోదు
– యాలాల లక్ష్మీనారాయణపూర్ వద్ద ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాళం వేసి ఉన్న సూపర్ మార్కెట్‌ను టార్గెట్‌గా చేసుకుని గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన యాలాల మండలం అగ్గనూర్ రోడ్డు మార్గంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో ఉన్న శ్రీనివాస సూపర్ మార్కెట్లో చోరీ కలకలం రేపింది.

గురువారం ఉదయం ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ చోరీలో రూ.1.25 లక్షల నగదు అపహరణకు గురైనట్లు యజమాని తెలిపారు. సూపర్ మార్కెట్లోకి దొంగలు చొరబడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఫుటేజీని సేకరించారు.

కేసు నమోదు చేసి సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇదే లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో రెండు నెలల క్రితం కూడా చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు.తాజాగా మరోసారి ఘటన చోటుచేసుకోవడంతో వ్యాపారులు, స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని పోలీసులను కోరుతున్నారు. మరోవైపు సూపర్ మార్కెట్ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే దొంగలు పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


