సామాన్యుల ఆకలి తీర్చేందుకు ఇందిరా క్యాంటీన్
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– మున్సిపల్ కార్యాలయంలో క్యాంటీన్ ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి: సామాన్యులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన భోజనం అందించడంతో పాటు మహిళా సంఘాలకు ఉపాధి కల్పించడమే ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు.

శుక్రవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఇందిరా క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు, కార్మికులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, నిరుపేదలకు తక్కువ ధరలో రుచికరమైన భోజనం అందించేందుకు క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

భోజనం నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్యాంటీన్ నిర్వహించడం ద్వారా వారికి ఆదాయ మార్గం ఏర్పడుతుందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ క్యాంటీన్‌ను విజయవంతంగా నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమీషనర్ రాకేష్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.


