నలుగురితో మొదలు.. 40 మందికి చేర్చి..!
– అడాల్‌పూర్ బడికి శ్రీనివాస్ జీవం
– జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా దక్కిన గౌరవం
– అభినందనలు తెలిపిన పీఆర్టీయూ, ఉపాధ్యాయులు
యాలాల, దర్శిని ప్రతినిధి : నలుగురు విద్యార్థులతో ఉన్న ప్రభుత్వ పాఠశాలను.. 40 మంది విద్యార్థులతో కళకళలాడేలా చేసిన యాలాల మండలం అడాల్‌పూర్ ఎంపీపీఎస్‌లో ఎస్జీటీగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వై. శ్రీనివాస్‌కు అరుదైన గౌరవం దక్కింది.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వై. శ్రీనివాస్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల సంఖ్య పెంపునకు ఆయన చేసిన కృషిని గుర్తించిన జిల్లా యంత్రాంగం ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకుని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.

బదిలీపై అడాల్‌పూర్ పాఠశాలకు వచ్చిన సమయంలో కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే ఉండేవారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న విద్యా సౌకర్యాలను వివరించడం వంటి కార్యక్రమాలతో విద్యార్థుల సంఖ్యను క్రమంగా పెంచి సంఖ్యను 40 మంది విద్యార్థులకు చేర్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన శ్రీనివాస్‌ను శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, తాండూరు ఎమ్మెల్యే బూయ్యని మనోహర్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి సన్మానించి అభినందించారు.

అనంతరం పీఆర్టీయూ టీఎస్ యాలాల మండల అధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి పరమేష్, జడ్పీహెచ్ఎస్ కొకట్ కాంప్లెక్స్ హెచ్ఎం కృష్ణారెడ్డి, యాలాల ఎంఈఓ వై. శాంతప్ప తదితరులు శ్రీనివాస్‌ను అభినందించారు.


