తీన్మార్ మల్లన్నతో బీసీ సంఘం నేతల భేటీ
– నియోజకవర్గ పరిస్థితులు, బీసీల రాజకీయ అవకాశాలపై చర్చ
– సమాచార లోపంపై పరస్పరం స్పష్టత
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా తాండూరు ప్రాంతానికి వచ్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను నియోజకవర్గ బీసీ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

శనివారం ఆయనతో భేటీ అయ్యి తాండూరు నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులు, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, భవిష్యత్ అవకాశాలపై ఆయనతో చర్చించారు. మల్లన్న తాండూరుకు వస్తున్న విషయం ముందుగా తమకు తెలియకపోవడంతో తగిన రీతిలో స్వాగతం పలకలేకపోయామని బీసీ సంఘం నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై మల్లన్న స్పందిస్తూ.. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా ముందస్తు సమాచారం ఇవ్వలేకపోయామని, తన పర్యటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించినట్లు తెలిపారు. అనంతరం తాండూరులో బీసీ సంఘం కార్యకలాపాలు, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, నియోజకవర్గంలో భవిష్యత్ రాజకీయ పరిణామాలపై నాయకులతో మల్లన్న చర్చించారు.

బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడమే తమ యాత్ర ఉద్దేశమని మల్లన్న ఇటీవల తన పర్యటనల్లో పేర్కొన్నారు.ఈ భేటీలో రాష్ట్ర బీసీ కార్యదర్శి సయ్యద్ షుకూర్, జిల్లా బీసీ నాయకులు గడ్డం వెంకటేశ్, సోషల్ మీడియా ఇన్‌చార్జి బస్వరాజ్, నాయకులు పరమేశ్, వివేక్, కిరణ్, సంజూ, జోసఫ్, శ్రీకాంత్, చిన్ని తదితరులు పాల్గొన్నారు.


