తెలంగాణలో కొత్త బస్టాండ్లు..!
– కొడంగల్, కోస్గి, మద్దూరులో నిర్మాణాలు
– రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థకు కొత్త రూపు రానుంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు బస్టాండ్లను ఆధునిక వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఆధునిక వసతులతో నూతన బస్టాండ్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ జాబితాలో కొడంగల్, కోస్గి, మద్దూరు ప్రాంతాలు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. నాగర్‌కర్నూల్, రేగొండ, హుజూర్‌నగర్, కోదాడ, కొడంగల్, కోస్గి, మద్దూరు, కేసముద్రం, హుస్నాబాద్, ములుగు, మధిర, నల్గొండ, కొత్తగూడెం ప్రాంతాల్లో కొత్త బస్టాండ్లు రానున్నాయి. బస్టాండ్లలో ఏర్పాటు చేసే దుకాణాలు, ఫుడ్‌కోర్టులు, వాణిజ్య సముదాయాల ద్వారా స్థానిక వ్యాపారులకు అవకాశాలు పెరగడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
కొత్త బస్టాండ్లలో ప్రయాణికుల కోసం విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఫుడ్‌కోర్టులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, బిజినెస్ సముదాయాలు, ఇతర ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులకు ఒకే ప్రాంగణంలో ఆహారం, షాపింగ్ తదితర సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

కొడంగల్‌లో 1.91 ఎకరాల విస్తీర్ణంలో నూతన బస్టాండ్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ప్రతిపాదించిన నమూనాను బట్టి రూ.15.82 కోట్లు లేదా రూ.11.53 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే పనులు ప్రారంభమైన ప్రాంతాల్లో కొడంగల్ కూడా ఉంది.

కోస్గిలో 1.55 ఎకరాల్లో రూ.15.08 కోట్లు లేదా రూ.9.60 కోట్లతో, మద్దూరులో 1.05 ఎకరాల్లో రూ.7.60 కోట్లు లేదా రూ.4.48 కోట్లతో నిర్మాణ ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రాంతాలతో పాటు హుస్నాబాద్‌లోనూ పనులు ప్రారంభమైనట్లు సమాచారం.


