శ్మశాన వాటికల అభివృద్ధికి ‘ఆత్మగౌరవ దీక్ష’
– రూ.5 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్
– తాండూరులోని అన్ని శ్మశాన వాటికలను ఆధునీకరించాలి
– రేపు అంబేద్కర్ కూడలిలో దీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని శ్మశాన వాటికలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని బీసీ సంఘం ఆధ్వర్యంలో ‘ఆత్మగౌరవ దీక్ష’ చేపట్టనున్నట్లు నియోజకవర్గ కన్వీనర్ రాజ్‌కుమార్ కందుకూరి తెలిపారు.

మంగళవారం ఉదయం 11 గంటలకు డా.బి.ఆర్.అంబేద్కర్ కూడలిలో దీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలోని శ్మశాన వాటికల్లో ప్రహరీలు, గేట్లు, అంతర్గత రహదారులు, నీరు, విద్యుత్, లైటింగ్, షెడ్లు, దహన వేదికలు, పారిశుధ్యం తదితర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

అన్ని శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.5 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. గతంలో పలుమార్లు వినతిపత్రాలు, ఆందోళనలు నిర్వహించినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదన్నారు. తాత్కాలికంగా శుభ్రం చేయడం కాకుండా పూర్తిస్థాయి అభివృద్ధి చేపట్టాలని కోరారు. మల్రెడ్డిపల్లి ప్రాంతానికి ప్రత్యేక శ్మశాన వాటిక కోసం ప్రభుత్వ భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు.

శ్మశాన వాటికల అభివృద్ధి ప్రతి కుటుంబానికి సంబంధించిన అంశమని, దీక్షకు కుల సంఘాలు, సామాజిక సంఘాలు, యువత, మహిళలు, ప్రజా సంఘాలు, పట్టణ ప్రజలు పాల్గొనాలని రాజ్‌కుమార్ కందుకూరి కోరారు.

