పూజలు చేసి.. పొలంలో తవ్వకాలు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పూజలు చేసి.. పొలంలో తవ్వకాలు..!
– గుప్త నిధుల వేటలో కీలక విషయాలు
– తొమ్మిది మందిపై కేసు నమోదు
– వెల్లడించిన యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి
యాలాల, దర్శిని ప్రతినిధి: గుప్త నిధుల కోసం అర్ధరాత్రి వేళ పొలంలో పూజలు నిర్వహించి తవ్వకాలు చేపట్టినట్లు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

యాలాల మండలం బండమీదిపల్లిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఘటనపై యాలాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బండమీదిపల్లి శివారులో దత్తు రామకృష్ణకు చెందిన పొలంలో రాత్రి సమయంలో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నట్లు సమాచారం అందింది.

దీంతో ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి దత్తు రామకృష్ణ, తిరుమలేష్, నారాయణ, ఉద్దరి నరసింహులు, విస్లావత్‌ గోప్యా నాయక్‌, కావలి పకీరప్ప, దత్తు నర్సింలు, బోగారం శ్రీనివాస్‌, రాళ్లపేట రాములు రాత్రి సమయంలో రామకృష్ణ పొలంలో పూజలు నిర్వహించి, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు విచారణలో తేలిందని ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.

అందిన ఫిర్యాదు ఆధారంగా 9 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తవ్వకాలు ఎందుకు చేపట్టారు? పూజలు ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి? గుప్త నిధుల పేరుతో జరిగిన ఈ వ్యవహారం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి జేసీబీ, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నిందితుల్లో ఓ గ్రామ సర్పంచ్ భర్త, మరో గ్రామం మాజీ సర్పంచ్ తదితరులు ఉన్నట్లు ప్రచారం జరిగింది.

శ్రీ ఆద్య మృతిపై విచారణ జరపాలి