స్మశాన వాటికపై రియల్ దౌర్జన్యం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

స్మశాన వాటికపై రియల్ దౌర్జన్యం..!
– రాత్రికి రాత్రే సమాధుల కూల్చివేత
– 20నుంచి 25 సమాధులు మాయం
– యంత్రాలతో రోడ్లు వేసి కబ్జాకు యత్నం
– ఆగ్రహం వ్యక్తం చేసిన పాత తాండూరు వాసులు
– రేపు మెరుపు దర్నాకు సిద్దమైన స్థానికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని కొందరు రియల్ వ్యాపారులు రెచ్చిపోయారు. ఎస్సీ వర్గానికి చెందిన స్మశాన వాటిక అని చూడకుండా స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారు.

రాత్రికి రాత్రే యంత్రాలతో స్మశాన వాటికలో సమాధులు కూల్చి వేసి.. రోడ్లు కూడా వేశారు. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని మున్సిపల్ పరిధి సీతారాంపేట్‌ సమీపంలో సర్వేనెంబర్ 3లో ఎస్సీ స్మశాన వాటిక ఉంది.

కొన్నేళ్లుగా ఈ స్మశాన వాటికను కొందరు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మంగళవారం కొందరు రియల్ ఏస్టేట్ వ్యాపారులు కబ్జా చేసేందుకు యత్నించారు. స్మశాన వాటిలో సుమారు 20 నుంచి 25 స్మశాన వాటికలను యంత్రాలతో కూల్చి వేసినట్లు స్థానికులు గుర్తించారు. ఆ సమాధులు కనిపించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

స్మశాన వాటికలో రియల్ వ్యాపారులు చేసిన దౌర్జన్యాన్ని వ్యతిరేకించారు. కబ్జాకు గురవుతున్న స్మశాన వాటికను కాపాడుకునేందుకు పోరుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగా స్మశాన వాటికను కాపాడాలని డిమాండ్ చేస్తూ రేపు గురువారం తాండూరు తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల ముందు మెరుపు దర్నా చేపడుతున్నట్లు పాత తాండూరు వాసులు తెలిపారు. ఈ దర్నాలో మాదిగ, మాల వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు, యువకులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

886 కొలువులకు గ్రీన్‌సిగ్నల్‌..!