పీపుల్స్ కాలేజీ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి
– కళాశాల పూర్వ విద్యార్థుల డిమాండ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పీపుల్స్ డిగ్రీ కళాశాలలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. నిందితులపై చర్యలు తీసుకోవాలని కళాశాల పూర్వ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈనెల 22న కళాశాలలో రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి సర్టిఫికెట్లు కాల్చిన సంఘటనపై సోమవారం వారు కళాశాలను సందర్శించి పరిశీలించారు. కళాశాలలో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తాండూరు పట్టణ పోలీస్టేషన్లో సీఐ రాజేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థులు భాను, జిలాని, దత్తాత్రేయ తదితరులు మాట్లాడుతూ 50 ఏండ్ల చరిత్ర కలిగిన పీపుల్స్ కళాశాలలో ఇలాంటి ద్వంసమైన ఘటన చోటు చేసుకోవడం దారుణమన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.

