దేశంలో థ‌ర్డ్‌వేవ్ తిష్ట‌..!

ఆరోగ్యం తెలంగాణ హైదరాబాద్

దేశంలో థ‌ర్డ్‌వేవ్ తిష్ట‌..!
– తెలంగాణ‌లో భారీగా ఒమిక్రాన్ కేసులు
– రాజ‌కీయ‌, ప్ర‌జా కార్య‌క్ర‌మాల‌కు వాయిదా త‌ప్ప‌నిస‌రి
– క‌రోనా ల‌క్ష‌ణాలు ఉంటే ప‌రీక్ష‌లు చేయించుకోండి
– తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు
ద‌ర్శిని డెస్క్ : క‌రోనా, ఒమిక్రాన్ కేసుల వ్యాప్తికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేసిన కేసుల న‌మోదు ఏమాత్రం త‌గ్గడంలేదు. దేశంలో క‌రోనా, ఒమిక్రాన్ కేసులు అల‌జ‌డిని సృష్టిస్తుండ‌డంతో థ‌ర్డ్‌వేవ్‌లోకి వ‌చ్చేసిన‌ట్లు ప‌లు రాష్ట్రాలు అంచ‌నాలోకి వ‌చ్చేశాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణలోనూ థర్డ్‌వేవ్ తిష్టవేసింద‌ని తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న ఒక్కరోజే దేశంలో లక్షకు చేరువలో కేసులు నమోదు అయ్యాయంటూ పేర్కొన్నారు. క‌రోనా, ఒమిక్రాన్ కేసులు అధికంగా న‌మోద‌వుతున్న‌ దేశంలోని 15 రాష్టాల్లో తెలంగాణ రాష్ట్రం కూడ ఉంద‌ని అన్నారు. నిన్న ల‌క్ష‌కు చేరువ‌గా న‌మోదైన కేసుల్లో తెలంగాణ నుంచి 1600 కేసులు నిన్న నమోదయ్యాయని వెల్ల‌డించారు. జీహెచ్‌ఎంసీ, మేడ్చల్, రంగారెడ్డిల్లో కేసుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. జనవరి 1 నుంచే రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని.. ఐదురోజులుగా 4 రెట్లకుపైగా కేసులు వస్తున్నాయన్నారు. పాజిటివిటీ రేటు 3 శాతానికిపైగా ఉందని తెలిపారు.

క‌రోనా పాటు ఒమిక్రాన్ వైరస్ ప్రజా సమూహంలోకి వెళ్లిందని స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని అన్నారు. ప్ర‌స్త‌తం నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతం ఒమిక్రాన్ బాధితులే ఉంటున్నార‌ని త‌మ అంచనాలో వెల్ల‌డ‌య్యిందన్నారు. అయితే కోవిడ్ బారిన పడిన వాళ్లు దాదాపు ఐదు రోజుల్లోనే కోలుకుంటున్నారని తెలిపారు. కరోనా లక్షణాలుంటే.. వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే యోచన లేదని, పేదల బతుకుదెరువు ముఖ్యమంటూ స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. ఫిబ్రవరి చివర్లో కేసుల సంఖ్య తగ్గే అవకాశముందని తెలిపారు. ఈ నేప‌థ్యంలో రాజకీయ పార్టీలు వచ్చే నాలుగు వారాలు కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని సూచించారు. ప్ర‌జ‌లు కూడ జ‌నాలు ఎక్కువ‌గా కూడే కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌కుండా ఉంటే మంచిద‌న్నారు. క‌రోనా, ఒమిక్రాన్ బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌న్నారు.