మిస్సింగ్ టెన్షన్‌..!

క్రైం తెలంగాణ రంగారెడ్డి వికారాబాద్

మిస్సింగ్ టెన్షన్‌..!
– అన్నపూర్ణ అదృశ్యంలో ట్విస్టులు
– సత్యమూర్తి ఆజ్ఞాతంలో ఉత్కంఠ
– విచారణలో నిమగ్నమైన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధిః వికారాబాద్‌ జిల్లా తాండూరులో భార్య అదృశ్యం, పిల్లలతో కలిసి భర్త అజ్ఞాతంలోకి వెళ్లిన సంఘటనలో టెన్షన్ రోజు రోజుకు పెరిగిపోతుంది. అదృశ్యం కేసులో ట్విస్టులు, భర్త అజ్ఞాతం అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తాండూరు పట్టణానికి చెందిన బీఎస్పీ పార్టీ జిల్లా అధ్య క్షులు దొరశెట్టి సత్యమూర్తి భార్య అన్నపూర్ణ(36) గత మూడునెలల క్రితం ఇంటినుంచి వెళ్లి అదృశ్యమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు, సత్యమూర్తి ఆమె ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా ఆమె అదృశ్యంలో ఊహించని ట్విస్టులు ఎదురవుతున్నాయి. సత్యమూర్తి భార్య అన్నపూర్ణ గురించి ఇద్దరు బందువులు ఫోన్‌లో మాట్లాడుకున్న సంంభాషణ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో అనిల్‌, మల్లు అనే ఇద్దరు వ్యక్తులు అన్నపూర్ణ ఆచూకీ గురించి మాట్లాడుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అన్నపూర్ణ దొంగ పాస్ పోర్టుతో దుబాయి వెళ్లినట్లు మల్లు అనే వ్యక్తి చెప్పినట్లు ఆ సంభాషణ సాగిందని సమాచారం. ఇక్కడ మల్లు అనే వ్యక్తి అన్నపూర్ణ ఆచూకీ తనకు తెలుసని రూ. 2 కోట్లు ఇప్పిస్తే చెబుతానని అనిల్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీనికి సత్యమూర్తి రూ. 1.50 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో పోలీసులు ఫోన్‌లో మాట్లాడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి.

కారులో చెక్కర్లు.. సీసీ పుటేజీలో రికార్డు
మరోవైపు తన భార్య అదృశ్యం కేసులో పోలీసులు పురోగతిని సాధించలేదంటూ సత్యమూర్తి సోషల్ మీడియాలో వైరల్‌ పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో భార్య అదృశ్యం కేసును 48 గంటల్లో చేధించాలని గడువు ఇవ్వడం సంచలనంగా మారింది. కేసును చేధించకపోతే ఆత్మహత్య చేసుకుంటాని, అప్పటి వరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోతామని పేర్కొనడం ఆందోళన రేపింది.
అనుకున్నట్లుగానే సత్యమూర్తి వీడియో పోస్టు అనంతరం తన పిల్లలు ప్రవర్ష(17), అక్షర(13)లతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శుక్రవారం అర్దరాత్రి దాటిన తరువాతే ఇంటి నుంచి పిల్లలతో వెళ్లిపోయినట్లు అందరు అనుమానిస్తున్నారు. వీడియో వైరల్ అనంతరం పోలీసులు కేసులో ముమ్మర విచారణ చేపట్టారు. ప్రత్యేక బృందాలను నియమించి గాలింపు చేస్తున్నారు. సత్యమూర్తికి చెందిన కారు ఎక్కడికి వెళ్లిందో అంటూ ఆరా తీశారు. సత్యమూర్తి కారు పరిగి, శంషాబాద్‌ ప్రాంతాలలో చెక్కర్లు కొట్టినట్లు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. అనంతరం వారు ఎక్కడికి వెళ్లారనే విషయం తెలియడంలేదు. పోలీసులకు ఇచ్చిన 48 గంటలలో 24 గంటలు పూర్తి కావడంతో ఇద్దరి మిస్సింగ్ కేసు అందరిలో టెన్షన్‌ పెడుతోంది. ఈ సంఘటన ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతోందో అని అసక్తితో ఎదురుచూస్తున్నారు.