ఆస్తి పేపర్లు పోతే..!
– తిరిగి పొందే అవకాశాలు
– ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకోండి
దర్శిని డెస్క్ : ఎవరైనా వారి ఇంటి, భూమి, వ్యవసాయ పొలం, తదితర స్థిరాస్తులకు సంబంధించిన పేపర్లు అనుకోని కారణాల వల్ల పోగొట్టుకుని ఆందోళన చెందుతుంటారు. తిరిగి వాటిని పొందడం ఎలా తెలియక గుబులు పడుతున్నారు. ఆస్తి దస్తావేజులు పోయినా తిరిగి పొందవచ్చనే విషయం కొంతమందికే తెలుసుంటుంది. పోయిన ఆస్తి పేపర్లను ఎలా పొందాలో తెలుసుకుని మీరు కూడ ఆందోళనను దూరం చేసుకోండి. ఇందుకోసం ఏం చేయాలో కింద చదువుకుని తెలుసుకోండి.
ఓ ఆస్తి కోనుగోలు చేసిన తరువాత రిజిస్ట్రేషన్ చేసుకున్న పత్రాలనే టైటిల్ డీడ్ అంటాము. అంటే.. యాజమాన్య పత్రం. ఏదైనా ఆస్తికి సంబంధించి చట్టపరమైన హక్కును తెలియజేస్తుంది. ఆస్తిని అమ్మాలన్నా, తాకట్టు పెట్టి రుణం పొందాలన్నా, ఆ ఆస్తి తమ పేరుపై ఉన్నదని రుజువు చేయాలన్నా.. ఈ డాక్యుమెంట్ అవసరం.
ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోగొట్టుకుంటే..
ఒకవేళ మీ ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు పోతే డూప్లికేట్ కాపీ పొందవచ్చు. రిజిస్టర్డ్ ఆస్తులకు సంబంధించిన వివరాలను రిజిస్ట్రేషన్ కార్యాలయం వారు తమ రికార్డుల్లో భద్రపరుస్తారు. అక్కడి నుంచి డూప్లికేట్ కాపీ పొందవచ్చు. అయితే దీనికి కొంత ప్రొసీజర్ అనుసరించాల్సి ఉంటుంది. ఆస్తికి సంబంధించిన పత్రాలు పోయినా లేదా దొంగిలించారని తెలిసిన వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్షర్మేషన్ రిపోర్ట్) లేదా ఎన్సీఆర్ (నాన్ కాగ్నిజిబుల్ రిపోర్ట్)ను ఫైల్ చేయాలి. దానికి సంబంధించిన ఒక కాపీని మీ వద్ద భద్రపరుచుకోవాలి. ఇది భవిష్యత్‌లో ఉపయోగపడుతుంది.
ఎఫ్ఐఆర్ను నమోదు చేసిన తర్వాత మీరు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసు శాఖ అధికారులు పరిశోధన చేసి పత్రాలను కనుగొనేందకు ప్రయత్నిస్తారు. ఒకవేళ పత్రాలను పోలీసులు ట్రేస్ చేయడంలో విఫలం అయితే నాన్-ట్రేసబుల్ సర్టిఫికేట్ (ఎన్టీసీ)ను జారీచేస్తారు. ఫిర్యాదులకు సంబంధించి పోలీసు అధికారులు ట్రేస్ చేయని వాటికి సంబంధించిన నాన్-ట్రేసబుల్ రికార్డును ప్రతి పోలీసు స్టేషన్లోనూ నిర్వహిస్తారు. ఎన్టీసీ వాస్తవంగా నష్టం జరిగిందని తెలియజేస్తుంది. డూప్లికేట్ ఆస్తి పత్రాలను పొందేందుకు కావాల్సిన కీలక పత్రం ఇది. అలాగే, దుర్వినియోగం లేదా మోసాలను నివారించడంలోనూ సహాయపడుతుంది.
పత్రికల్లో నోటీసు ప్రకటన
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత.. దీనికి సంబంధించిన నోటీసును కనీసం రెండు వార్తా పత్రికల్లో వచ్చేట్లు చూసుకోవాలి. ఒకటి ఆంగ్లంలో, మరొకటి స్థానిక భాషలో ఉండాలి. ఆస్తికి సంబంధించిన మొత్తం వివరాలు, పోగొట్టుకున్న పత్రాలు, మీ సంప్రదింపు వివరాలతో ప్రకటన ఇవ్వాలి. ఒకవేళ పోయిన పత్రాలు వేరొకరికి దొరికి ఉంటే.. వారు ఆస్తి యజమానికి తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ నోటీసు ఇచ్చేందుకు పత్రికను అనుసరించి ప్రచురణకు రూ.3500 వరకు, న్యాయవాదికి చెల్లించాల్సి చట్టపరమైన రుసుముల కోసం దాదాపు రూ.5000 వరకు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఈ నోటీసు ద్వారా యజమాని ఆస్తికి ఉన్న యాజమాన్య హక్కుకు ప్రజల్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ప్రచురణ తేదీ నుంచి 15 రోజుల లోపు క్లెయిం చేసేందుకు ఆహ్వానిస్తూ ఈ నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
డూప్లికేట్ పత్రాలు..
15-రోజుల నోటీసు వ్యవధి ముగిసిన తర్వాత, మీరు తప్పనిసరిగా సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి, ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలు, పోగొట్టుకున్న పత్రాల వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీ, నాన్ ట్రేసబుల్ సర్టిఫికెట్, నోటరీ అఫిడవిట్లను సమర్పించి డూప్లికేట్/సర్టిఫైడ్ కాపీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి 7 నుంచి 10 పని దినాల్లో డూప్లికేట్ సేల్ డీడ్ లేదా టైటిల్ డీడ్ కాపీని పొందుతారు.
నోటరీ తప్పనిసరి
డూప్లికేట్ సర్టిఫికెట్ కాపీ కోసం దరఖాస్తు చేసుకునే ముందు.. రూ.10 నాన్ జుడీషియల్ స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్ నోటరీ చేయించాలి. ఇందులో ఎఫ్ఐఆర్ నంబరుతో పాటు, ఆస్తికి సంబంధించిన (పోయిన) పత్రాల వివరాలు, వార్తాపత్రికలలో ప్రచురించిన నోటీసు, ప్రచురణ చెల్లుబాటుకు సంబంధించిన లాయర్ సర్టిఫికెట్, దరఖాస్తు చేయడానికి గల కారణాన్ని పేర్కొనాలి. డూప్లికేట్ ఆస్తి పత్రాలు సబ్ రిజిస్ట్రార్ ఆమోదంతో స్టాంపింగ్‌తో పొందుతారు కాబట్టి ఇవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. ఈ సర్టిఫైడ్ కాపీ ద్వారా ఆస్తి క్రయవిక్రయాలతో పాటు రుణ దరఖాస్తు వంటి లావాదేవీలను కూడా చేయవచ్చు

