రెండేళ్లలో అధికారం చేపట్టడమే హస్తం లక్ష్యం..!
– టీఆర్ఎస్, బీజేపీలవి నాటకీయ రాజకీయాలు
– ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పక్కదోవ
– టీపీసీపీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నాటకీయ రాజకీయాలకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్ విమర్శించారు. వచ్చే రెండేళ్లలో అధికారం చేపట్టడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ఇందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం తాండూరు పట్టణంలోని సిండీకేట్ కార్యాలయంలో తాండూరు నియోజకవర్గంలో ఉన్న బషీరాబాద్, తాండూర్ , పెద్దెముల్, యాలాల మండలాలకు చెందిన నాయకులతో పాటు పట్టణంలోని కాంగ్రెస్ ఎన్రోల్ మెంటర్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అథితిగా హాజరైన టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా పరిపాలనను పక్కనపెట్టిందన్నారు. అనవసర విషయాలు, కార్యక్రమాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజా సమస్యలను పక్కనపెట్టి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రస్ పార్టీని వచ్చే 2023 ఎన్నికల్లో అధికారం చేపట్టే విధంగా అందరు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త సత్యనారాయణ రెడ్డి, పెద్దేముల్ జడ్పిటిసి ధారాసింగ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, ఫ్లోర్ లీడర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదల్లి రవి కుమార్, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

