ఉత్సహాంగా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్..!

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

ఉత్సహాంగా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్..!
– పోలీసు వర్సెస్ ప్రెస్ జట్టు
– విజయం సాధించిన పోలీసు జట్టు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి యేడాది మాదిరిగానే పోలీసు, ప్రెస్ మద్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉత్సహంగా జరిగింది. ఆదివారం తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్ మైదానంలో తాండూరు డివిజన్ లోని పోలీసు, ప్రెస్ జంట్ల మద్య క్రికెట్ పోటీ నిర్వహించారు. ఇరు జట్ల మధ్య 16 ఓవర్లతో మ్యాచ్ ను ప్రారంభించారు. పోలీసు జట్టుకు తాండూరు రూరల్ సీఐ రాంబాబు, ప్రెస్ జట్టుకు సాక్షి రామకృష్ణలు కెప్టెన్లుగా వ్యవహరించారు. ముందుగా టాస్ గెలిచిన ప్రెస్ జట్టు పోలీస్ జట్టుకు బ్యాటింగ్ అప్పగించి ఫీల్డింగ్ కు దిగారు. మొత్తం 16 ఓవర్లలో పోలీసు జట్టు 10 వికెట్లను కోల్పోయి 121 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ప్రెస్ జట్టులో టాప్ ఆర్డర్ తడబడి వెనువెంటనే వికెట్లను కోల్పోయింది. మిడిలార్డర్ లో దిగిన బ్యాట్స్ మెన్ లు నిలదొక్కుకుని 11.5 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి 78 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో ప్రెస్ జట్టుపై పోలీసు జట్టు విజయం సాధించి విన్నర్‌గా నిలిచింది. పోలీసు జట్టులో రూరల్ సీఐ రాంబాబు 24 పరుగులు, టౌన్ సీఐ రాజేందర్ రెడ్డి 17 పరుగులు సాధించారు. ప్రెస్ జట్టులో మిడిలార్డర్లో వచ్చిన నవీస్ అత్యధికంగా 33 పరుగులు సాధించారు. ప్రెస్ జట్టు బౌలర్లు పాష 4 వికెట్లు, రాజు 2 వికెట్లు తీయగా.. పోలీసు జట్టు బౌలర్లు అయిన వెంకటేష్ 5 వికెట్లు, ఎస్ఐ అరవింద్ 2 వికెట్లు తీశారు.

5 వికెట్లు తీసిన పోలీసు జట్టు వెంకటేష్ కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించగా బెస్ట్ బ్యాట్స్ మెన్ నవీన్, బెస్ట్ బౌలర్ గా పాషలు ఎంపికయ్యారు. విజేత, రన్నర్ లుగా నిలిచిన జట్లకు తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్ చారి, వేణుగోపాల్ రెడ్డి, శెట్టి రవిశంకర్, వాసు, లింగేష్, భీం సేన్ రావు, రాంచెందర్ లు ట్రోఫీ, మెమెంటోలను అందజేశారు.

ఇందులో విన్నర్ జట్టు రూ. 3 వేలు, రన్నర్ జట్టు రూ. 1500లు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రూ.500ల చొప్పున నగదు బహుమతులను అందజేశారు. అదేవిధంగా టీర న్యూస్ యజమాని శ్రీనివాస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విన్నర్ జట్టుకు రూ. 3 వేలు, రన్నర్ జట్టుకు రూ.2వేలు నగదును అందజేశారు. ఈ మ్యాచ్ లో అంపైర్లుగా వ్యవహరించిన సహారా క్రికెట్ అకాడమీ కోచ్ లు జగన్నాథ్ రెడ్డి, సతీష్, శరత్ లతో పాటు స్కూల్ ప్రిన్సిపల్ ఆరోగ్య రెడ్డిలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.