ఉయ్యాలతో నిరాశ్రయ చిన్నారుల సంరక్షణ

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

ఉయ్యాలతో నిరాశ్రయ చిన్నారుల సంరక్షణ
– చిన్నారుల ఆక్రమ దత్తత నియంత్రణ సాధ్యం
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– జిల్లా ఆసుపత్రిలో ఉయ్యాల కేంద్రం ప్రారంభం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తల్లిదండ్రులు వద్దనుకునే నిరాశ్రయ చిన్నారులకు ఐసీడీఎస్ ఉయ్యాల కార్యక్రమం అండగా నిలుస్తుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. వికారాబాద్ జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉయ్యాల కేంద్రంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళితో పాటు వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, తాండూరు ఎంపీపీ అనిత రవీందర్ గౌడ్, కౌన్సిలర్లతో పాటు మహిళ, శిశు సంరక్షణ శాఖ, బాలర భవన్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీలక్ష్మిలు ఉయ్యాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్నతో పాటు పలువురు మాట్లాడుతూ పిల్లలను పెంచలె ని తల్లిదండ్రులు, శిశువులను కనిపారేసే తల్లిదండ్రులు ఉయ్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు వద్దకునే చిన్నారులకు ఉయ్యాల కార్యక్రమం వారి సంరక్షణకు అండగా నిలుస్తుందని అన్నారు. వద్దనుకునే చిన్నారులతో పాటు నిరాశ్రయంగా లభించిన చిన్నారులను ఉయ్యాలలో వదిలేస్తే అధికారులు శిశుగృహాల ద్వారా చేరదీస్తారని అన్నారు. చేరదీసిన చిన్నారులను చట్టబద్ధంగా దత్తత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఉయ్యాలతో శిశువులు, చిన్నారుల సంరక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. అక్రమ దత్తత నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు.

చట్టబద్ధంగానే చిన్నారుల దత్తత : జిల్లా కోఆర్డినేటర్ శ్రీలక్ష్మి
మరోవైపు జిల్లాలో చిన్నారుల అక్రమ దత్తతను నివారించుకునేందుకు అవగాహన కల్పించడం జరుగుతుందని మహిళ, శిశు సంరక్షణ జిల్లా కోఆర్డినేటర్ శ్రీలక్ష్మీ తెలిపారు.
చాలా మంది ముగ్గురు లేదా నలుగురు చిన్నారులను కని పోషించలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలాంటి చిన్నారులను ఉయ్యాల ద్వారా సమాచారం అందిస్తే వారిని శిశు గృహా, శిశు సంరక్షణ గృహాలకు అందజేస్తే సరంక్షిస్తామన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీల ద్వారా చిన్నారులను చట్ట బద్దంగా దత్తత ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కావున చిన్నారులను కని చెట్ల పొదల్లో, మురుగు కాలువలో పడేయకుండా ఉయ్యాలలో అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, సీనియర్ మహిళ నాయకురాలు. కౌన్సిలర్ విజయదేవి, జిల్లా ఆసుపత్రి వైద్యులు డా. ఆనంద్. ఐసీడీఎస్ సీడీపీట రేణుక, చైల్డ్లైన్ ప్రతినిధులు, శిశుగృహా ప్రతినిధులు, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.