క‌ర్ణాట‌క‌లో నైట్ క‌ర్ఫ్యూ ఎత్తివేత‌

జాతీయం తెలంగాణ

క‌ర్ణాట‌క‌లో నైట్ క‌ర్ఫ్యూ ఎత్తివేత‌
– ప్ర‌భుత్వ కార్యాలయాల్లో 100 శాతం ఉద్యోగులు
– 50 శాతంతో మైదానాలు, జిమ్‌లు, బార్లు, హోట‌ళ్ల‌కు అనుమ‌తి
ద‌ర్శిని డెస్క్: క‌రోనా ప్ర‌భావంతో క‌ర్ణాట‌క రాష్ట్రంలో విధించిన నైట్ క‌ర్ఫ్యూను బొమ్మై ప్ర‌భుత్వం ఎత్తి వేసింది. రేప‌టి నుంచి నైట్ క‌ర్ఫ్యూను ఎత్తి వేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది. కర్ణాటకలో సోమవారం (జనవరి 31) నుంచి నైట్ కర్ఫ్యూను ఎత్తివేయనున్నట్టు బొమ్మై ప్రభుత్వం ప్రకటించింది. బెంగళూరులో క్లాసులు కూడా పునఃప్రారంభం చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో పాఠశాలలను, కళాశాలలను సోమ‌వారం నుంచి తెర‌వ‌నున్న‌ట్లు రాష్ట్ర మంత్రి బీసీ న‌గేశ్ వెల్లడించారు. ప్ర‌భుత్వ కార్యాలయాల్లో 100 శాతం ఉద్యోగుల‌తో ప‌నిచేయ‌నున్న‌ట్లు మంత్రి నరేశ్ పేర్కొన్నారు. 50 శాతం సామ‌ర్థ్యంతో క్రీడా మైదానాలు, జిమ్‌లు, బార్లు, హోట‌ళ్ల‌ను తెరిచేందుకు అనుమ‌తి ఇచ్చారు. ఆల‌యాల్లో పూజ‌ల‌కు సైతం అనుమ‌తి ఇచ్చినట్లు పేర్కొన్నారు.
బెంగుళూరులో సైతం స్కూళ్లు తెరుచుకుంటాయని పేర్కొన్నారు. క‌రోనా నిబంధ‌న‌లను తప్పనిసరిగా పాటించేలా అన్ని శాఖ‌ల‌కు ఆదేశాలు జారీ చేసినట్లు నగేశ్ వెల్లడించారు. రాష్ట్రంలో ధ‌ర్నాలు, మ‌త‌ప‌ర‌మైన‌, రాజ‌కీయ‌మైన కార్య‌క్ర‌మాల‌కు మాత్రం అనుమ‌తి లేదని మంత్రి నగేశ్ స్పష్టంచేశారు. వివాహ వేడుక‌ల్లో నిబంధనలు ఎత్తేస్తున్నట్టు తెలిపారు. ఇండోర్‌లో జ‌రిగే పెళ్లి వేడుక‌ల‌కు 200 మంది, ఔట్‌డోర్‌లో జ‌రిగే వేడుక‌ల‌కు 300 మంది హజరయ్యేందుకు అనుమతి ఉందన్నారు.