మెప్పించిన పెద్దాసుప‌త్రి..!

ఆరోగ్యం తాండూరు రంగారెడ్డి వికారాబాద్

మెప్పించిన పెద్దాసుప‌త్రి..!
– జిల్లా ఆసుప‌త్రిని సంద‌ర్శించిన కాయ‌క‌ల్ప బృందం
– వైద్య సేవ‌ల, నిర్వ‌హణపై సంతృప్తి వ్య‌క్తం
– రాష్ట్రస్థాయి అధికారులకు నివేధిక
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : పేద‌ల‌కు కార్పోరేట్ స్థాయి వైద్య సేవ‌లు, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌ల‌తో తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కాయ‌క‌ల్ప బృందాన్ని మెప్పించింది. మంగళవారం తాండూరులోని జిల్లా ఆసుపత్రి, హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిని కాయకల్ప బృందం సందర్శించింది. ప్రతి యేడాది మాదిరిగానే కాయకల్ప అవార్డు కోసం జిల్లా ఆసుపత్రి పోటీలో పాల్గొంటున్న నేపథ్యంలో బృందం ఆసుపత్రిని సందర్శించింది.
ఇందులో భాగంగా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్ తో కలిసి ఆసుపత్రిలోని అత్యవసర విభాగం, ఆపరేషన్ థియేటర్, రక్తనిధి కేంద్రం. కొత్త ఏర్పాటు చేస్తున్న ఐసీయూ విభాగం, డయాలిసిస్ విభాగం, మహిళలు, పురుషుల చికిత్స వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యులు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. దీంతో పాటు ఆసుపత్రిలో వివిధ విభాగాలకు సంబంధించి రికార్డులను తనిఖీ చేశారు. ప్రతి వార్డులో పరిశుభ్రతను పరిశీలించారు.
అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు, పరిసరాలు, వార్డుల నిర్వహణ భేష్ గా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు ఆసుపత్రిపై సర్వే కొనసాగుతుందని చెప్పారు. కాయకల్ప అవార్డులో ఆసుపత్రి ఎంపికైతే మొదటి బహుమతి కింద రూ. 50 లక్షలు, ద్వితీయ బహుమతి కింద రూ. 25 లక్షల నిధులు వస్తాయని వెల్లడించారు. ఈ నిధులతో సర్వేలో గుర్తించిన మౌళిక సదుపాయాలను మెరుగుపరిచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ నివేధికను రాష్ట్ర స్థాయి అధికారులకు అందజేస్తామన్నారు. ఆసుపత్రిని తనిఖీ చేసిన కాయకల్ప బృందంలో మెదక్ ఆసుపత్రి ఆర్ఎంఓ ఆర్. షర్మిల, సివిల్ సర్జన్ ఎం.జయప్రసాద్, క్వాలిటీ మేనేజర్ ఎస్.గోపాల్, నర్సింగ్ సూపరిండెంట్ సుహాసిని, హెడ్ నర్సు జయలక్ష్మి, ఉషాదేవి, తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ డా. ఆనంద్ గోపాల్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.