ఉక్రేయిన్ నుంచి తాండూరు విద్యార్థిని సేఫ్
– స్వస్థలానికి వచ్చేందుకు నరక యాతన
– కేంద్ర మంత్రి సహాకారంతో నేడు ఢిల్లీకి
– కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థి కుటుంభ సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రష్యా – ఉక్రేయిన్ల మధ్య భీకర యుద్ధంలో చిక్కుకున్న వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన విద్యార్థిని సురక్షితంగా సరిహద్దు దాటింది. యుద్ద దేశం నుంచి సరిహద్దు చేరుకునేందుకు ఆమె నరక యాతన పడినట్లు తెలుస్తోంది. సరిహద్దు దాటిన తరువాత కేంద్ర మంత్రి సహాకారంతో నేడు ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే. తాండూరు పట్టణం అస్కరీ భాగ్ చెందిన ఫయాజ్ అలీ(రియాజ్ అలీ) కూతురు మదీహా ఆనమ్(23) మెడిసిన్ చదువుల కోసం 2019లో ఉక్రీయన్ దేశం వెళ్లింది. ప్రస్తుతం ఆమె ఇవానో ఫ్రాన్స్క్లీ యూనివర్సిటీలో 4 సంవత్సరం చదువుతోంది. ఇటీవలే ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం మొదలు కావడంతో ఆమె అక్కడే చిక్కుకుపోయింది. ఈ క్రమంలో అక్కడి నుంచి స్వస్థలం చేరేందుకు నరక యాతనకు గురయ్యంది.
ఉక్రేయిన్ దేశ సరిహద్దును దాటేందుకు 50 మందితో ఓ బస్సులో 24 గంటల పాటు ప్రయాణం చేసి స్లోవాకియా సరిహద్దుకు చేరుకుంది. సరిహద్దులో చేరిన తరువాత భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోటల్లో బస చేసింది. 16 మంది తెలుగు విద్యార్థులతో కలిసి బస చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిరణ్ రీజేజూ విద్యార్థులతో కలిసి మాట్లాడారు. బుధవారం రాత్రి వారిని ఢిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రత్యేక విమానంలో తాండూరు విద్యార్థిని మదీహా ఆనమ్ కూడ ఢిల్లీకి చేరుకోనుంది. అక్కడి నుంచి ఆమె తన స్వస్థలానికి చేరుకునే అవకాశం ఉంది. ఈవిషయం తెలిసిన కుటుంభ సభ్యులు భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

