ఫ్రాడ్ పోస్ట్ మాస్ట‌ర్

క్రైం తెలంగాణ హైదరాబాద్

ఫ్రాడ్ పోస్ట్ మాస్ట‌ర్
– రూ. 1 కోటి 62 ల‌క్ష‌లు స్వాహా
– సీబీఐ ప‌రిధికి కేసు
ద‌ర్శిని డెస్క్ : అతనో పోస్ట్ మాస్టర్ కాదు కాదు ఫ్రాడ్ మాస్ట‌ర్. అత‌ను చేసిన ఫ్రాడ్ గురించి తెలిస్తే మీరు అదే అంటారు. ఒక పోస్ట్ మాస్ట‌ర్ కేసు గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వ‌స్తుందంటే అత‌ను చేసిన ఫ్రాడ్ కేసు సీబీఐ దాకా వెళ్లింది. ప‌దండి వివ‌రాల్లోకి వెళ్లి అస‌లు విష‌యం తెలుసుకుందాం. నల్లగొండ జిల్లా(nalgonda district) చింతపల్లి పోస్టాఫీస్ పరిధిలో ఏడెనిమిది గ్రామాలున్నాయి. అక్కడ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా నరేశ్ అనే వ్యక్తి వర్క్ చేస్తున్నాడు. ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలు.. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు ఆ పోస్టాఫీసులోనే తీసుకుంటుంటారు. ఈ క్ర‌మంలోనే పోస్టాఫీస్ ద్వారా అందించే కేంద్ర పథకాలకు సంబంధించిన పింఛన్, ఉపాధి హామీ నిధులను పక్కదారి పట్టించాడు. ప‌లు అకౌంట్ల సంఖ్యను ఎక్కువగా చూపి డబ్బులను డ్రాచేసి. అనంతరం ఖాతాదారులకు నగదు చెల్లించినట్లు లెక్కలు చూపి.. ఆ సొమ్మంతా కాజేశాడు. ఒక్కో గ్రామం పరిధిలో రూ.20 లక్షల మేర నొక్కేశాడు. అయితే ఆడిట్ చేస్తుండగా అయ్యగారి బాగోతం బయటపడింది. ఏకంగా రూ.కోటి 62 లక్షలను కాజేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో నరేశ్‌పై 2020లో డివిజన్ సూపరింటెండెంట్ కంప్లైంట్ చేశారు. ఈ మేర‌కు నరేశ్‌పై పోస్టల్ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ స్కాంకు సంబంధించి తాజాగా నరేశ్‌పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఫ్రాడ్ పోస్ట్ మాస్ట‌ర్ కేసు న‌ల్గొండ‌తో పాటు రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాశంగా మారింది.