మెప్మా గారడి ఆర్పీపై వేటు
– విధుల నుంచి తొలగించిన అధికారులు
– ప్రకటించిన టీఎంసీ వెంకటేష్
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్త్రీ నిధి నిధుల చెల్లింపుల్లో గారడి చేసిన మెప్మా ఆర్పీపై అధికారులు వేటు వేశారు. తాండూరు ఆర్డీట, ఇంచార్జ్ కమిషనర్ అశోక్.. కుమార్ ఆదేశాల మేరకు విధుల నుంచి తొలగిస్తున్నట్లు మెప్మా టౌన్ మిషన్ కోఆర్డీనేటర్ వెంకటేష్ తెలిపారు. తాండూరు పట్టణం ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఆర్పీ జయశ్రీ స్త్రీనిధి రుణాలలో రూ. 2లక్షల 98,541లో దుర్వినియోగానికి పాల్పడినట్లు స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఈర్షాద్ మహిళ సంఘాలతో కలిసి గత నెల తాండూరు ఆర్డీఓతో పాటు మెప్మా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 23న విచారణ జరిపారు. అప్పట్లో మహిళ సంఘాలతో డీఎంసీ రవికుమార్, టీఎంసీ వెంకటేష్, స్త్రీనిధి మేనేజర్లు విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయిదే దీనిపై తాజాగా మరోసారి శుక్రవారం టీఎంసీ వెంకటేష్ విచారణ జరిపారు. ఈ విచారణలో కూడ ఆర్పీ జయశ్రీ అవినీతికి పాల్పడినట్లు తేలిందని తెలిపారు. మెప్మా విధులు సక్రమంగా నిర్వహించకుండా స్త్రీనిధి రుణాలను దుర్వినియోగం చేసినట్లు వెల్లడైందన్నారు. ఆమె స్వాహా నిధుల నుంచి కొంత మొత్తాన్ని రికవరీ చేయడం జరిగిందని, మిగతా డబ్బులను కూడ వచ్చే నవంబర్లోగా పూర్తిగా రికవరీ చేసి సంఘాలకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్డీఓ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఆర్పీ జయశ్రీని తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆమె స్థానంలో మరో ఆర్సీ హారికను ఇంచార్జ్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు టీఆర్ఎస్ నాయకులు ఈరాద్ మాట్లాడుతూ కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి మహిళ సంఘాల డబ్బులను దుర్వినియోగం చేసిన ఆర్పీ జయశ్రీపై చర్యలు తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆమె స్వాహా చేసిన నిధుల నుంచి మహిళ సంఘాలకు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

