హీటెక్కనున్న తాండూరు పాలిటిక్స్
– మరింత రంజుగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే రాజకీయం
– పల్లె పల్లెకు పైలెట్, పల్లె పల్లెకు ఎమ్మెల్సీ
– పోటా పోటీగా పల్లె కార్యక్రమాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్ర రాజకీయాలలో తాండూరు అసెంబ్లీ రాజకీయాలు అసక్తిగా ఉంటాయి. ఇక్కడి వర్గ పోరులో తలెత్తే వ్యవహార బేధాలు చర్చలకు కేంద్రబిందువుగా మారుతాయనడం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రానున్న రోజుల్లో ఈ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయని తెలుస్తోంది. తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మద్య రాజకీయ పరిణాలు హీటెక్కించేలా కనిపిస్తున్నాయి. తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈనెల 21 నుంచి పల్లె పల్లెకు పైలెట్ పేరుతో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈనెల 21న నియోజకవర్గంలోని యాలాల మండలం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వారంలో నాలుగు రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఈ కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడ పల్లె బాట పడుతున్నారు. వచ్చేనెల మొదటి వారంలో పల్లె పల్లెకు ఎమ్మెల్సీ కార్యక్రమంలో గ్రామాల్లోకి వెళ్లనున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పల్లె పల్లెకు పైలెట్‌ను అధికారికంగా నిర్వహిస్తుండగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇందుకు భిన్నంగా పల్లె పల్లెకు ఎమ్మెల్సీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఎలాంటి హంగులు, అర్భాటాలు లేకుండా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు పూర్తి భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్పష్టంగా పేర్కొంటున్నారు. ఏదేమైనా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల కార్యక్రమాలతో పల్లె పల్లెలో రాజీకీయాలు హీటెక్కడం ఖాయమని రాజీకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

