ముందస్తు ముచ్చటే లేదు
– గులాబీ ప్రత్యర్థి కమలమే
– ఎన్నికల్లో 105 స్థానాలు మావే
– మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముచ్చటే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు కేసీఆర్ బ్రేక్ వేశారు. ఆరునూరైనా ముందస్తు ఎన్నికలకు వెళ్తే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలేదని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యర్థి పార్టీ బీజేపీనే అని అన్నారు. గత ముందస్తు ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు, పనులు మేం చేయాల్సి ఉండేందని చెప్పుకొస్తూ కావున ముందస్తు ఎన్నికలకు వెళ్లి 88 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముచ్చటే లేదన్నారు. రాష్ట్రంలో పాలమూరు, సీతారామ పూర్తి కావాల్సి ఉందని, తెలంగాణకు ఐటీ, పరిశ్రమల పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో మొదటి సారి 63 సీట్లు, రెండోసారి 88 సీట్లు సాధించామని, ఇప్పుడు 95-105 సీట్ల మధ్య గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 30 స్థానాల్లో సర్వే చేస్తే 29 స్థానాల్లో మేం గెలుస్తామని రిపోర్టులో వచ్చిందని కేసీఆర్ తెలిపారు. 25 రోజుల తర్వాత ఒక రిపోర్ట్ ఇస్తాను.. దాని చూస్తే మీరే ఆశ్చర్య పోతారని అన్నారు.
మోడి ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వం
పంజాబ్ తరహాలో తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ ముందుంచి.. దేశంలో రైతుకు రాజ్యంగ రక్షణ హక్కు కల్పించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఆహార ధాన్యాల సేకరణలో దేశమంతా ఒకే పాలసీ ఉండాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈడీ ఐటిలకు భయపడే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు. ఐటీ ఈడీల పేరుతో బెదిరిస్తూ బ్లాక్ మేయిల్ చేస్తే తెలంగాణ సాధించిన మేము భయపడబోమన్నారు. దేశంలో అద్భుతమైన రైతు ఉద్యమాలను నిర్మించడానికి టిఆర్‌ఎస్ సమాయత్తం అవుతోందని.. ఇక మోదీ ప్రభుత్వాన్ని నిద్రపోనియ్యమంటూ కేసీఆర్ తూటాలు పేల్చారు.

