రైలు ఎక్కబోతూ..!
– పడిపోయిన ప్రయాణికుడు
– కాళ్లు చేతులు విరిగి తీవ్ర గాయాలు
– తాండూరు రైల్వే స్టేషన్లో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైలు ఎక్కబోతూ ప్రమాద వశాత్తు కిందపడి ఓ వ్యక్తికి తీవ్రగాయాలైన సంఘటన ఆదివారం తాండూరు రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా చేవేళ్ల మండలం తిమ్మాయిపల్లికి చెందిన చిన్నబాబు (32) ఆదివారం సాయంత్రం తాండూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. టిక్కెట్టు తీసుకుని హడావుడిగా కదులుతున్న రైలు ఎక్కబోయాడు. ప్రమాద వశాత్తు అదుపుతప్పి పట్టాల కిందకుపడబోయాడు. ఈ క్రమంలో అతని చేతికి, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన ప్రయాణికులు రైలును ఆపి.. బాధితున్ని బయటకు తీశారు. రైల్వే పోలీసులు సహాయంతో బాధితున్ని చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.


