ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త
– గ్రంథాలయాలలో పోటీ పరీక్షల మెటిరియల్
– 31న మంత్రి సబితారెడ్డిచే ప్రారంభం
– వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లకు సిద్దమవుతున్న నిరుద్యోగులకు వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గాజీపూర్ మురళీకృష్ణ గౌడ్ శుభవార్త చెప్పారు. ఈనెల 31వ తేది నుంచి గ్రంథాలయాలలో అభ్యర్థుల కోసం పోటీ పరీక్షల మెటిరియల్ అందుబాటులో ఉంచుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం ప్రభుత్వం అన్ని గ్రంథాలయాలలో పోటీ పరీక్షల మెటిరియల్‌ను అందుబాటులో ఉంచుతోందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా నుంచి శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. 31వ తేదిన వికారాబాద్ జిల్లా గ్రంథాలయంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులక మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు ఆయాచితం శ్రీధర్ గారు మరియు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ తదితరులు పాల్గొంటారని వివరించారు. అయితే నిరుద్యోగ తెలంగాణ ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తున్న ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులు వారికి అవసరమైన పుస్తకాల జాబితాను సంబంధిత లైబ్రరీలలో అందిస్తే వారం వ్యవధిలో ఆయా పుస్తకాలను సమకూరుస్తామని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

