మళ్లీ మాస్కు పెట్టుకోవాల్సిందే..!
– తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
– ఫోర్త్ వేవ్ భయం లేదు : డీహెచ్ శ్రీనివాసరావు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలో ప్రజలు మళ్లీ మాస్కులు ధరించాల్సిన పరిస్థితో ఏర్పడుతోందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయన్నారు. గత వారం 355 కేసులు నమోదు కాగా.. ఈ వారం 555 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 56శాతం పైగా కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 36వేలకు పైనే ఉండగా.. తెలంగాణలో 811 మంది బాధితులు ఉన్నారని వివరించారు. గత రెండు వారాలుగా కొత్త కేసుల పెరుగుదలను కనిపిస్తోందన్నారు. రెండున్నర నెలల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు రావడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్నా.. ఆస్పత్రిలో చేరికలు, మరణాలు దాదాపు సున్నాగానే ఉన్నాయన్నారు.
ఫోర్త్‌వేవ్ భయం లేదు
కరోనా వైరస్ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదని, మనతో పాటే ఉందని.. ఇది పూర్తిగా నిర్మూలన అయ్యేందుకు ఇంకా సమయం పడుతుందన్నారు. ‘దేశంలో గానీ, తెలంగాణ రాష్ట్రంలో గాని ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. వ్యాక్సినేషన్ కవరేజీ దాదాపు నూరు శాతం కావడం వల్ల ఎక్కువ మందిలో ఇమ్యూనిటీ తీసుకురాగలిగాం. ఇప్పుడు కేసులు కొంచెం పెరుగుతున్నా.. ఫోర్త్వేవ్కు కారణం కాకపోవచ్చు. దీంతో మనకు ఫోర్త్ వేవ్ భయం లేదన్నారు. మరోవైపు కేసులు పెరగడాన్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోండి. కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏకైక అస్త్రంగా ఉన్న మాస్క్‌ను పెట్టుకోండి. బహిరంగ ప్రదేశాలు, ప్రజారవాణాలో ప్రయాణించేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం మరిచిపోవద్దు. ఈ వర్షా కాలం ఫ్లూ సీజన్ గనక ఆ లక్షణాల నుంచి కొవిడ్‌ను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు మీ నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోండి. పిల్లలకు వ్యాక్సినేషన్ వేయించడం అత్యంత అవసరం. 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. త్వరలోనే పాఠశాలలు తెరుచుకోనుండటంతో పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు పిల్లలందరికీ టీకాలు వేయించేలా తగిన చర్యలు తీసుకోవాలి’’ అని డీహెచ్ సూచించారు.



