హంతకున్ని పట్టించిన క్యారీబ్యాగ్..!
– గ్రీన్‌సిటి హత్య కేసును చేధించిన పోలీసులు
– భార్య గురించి వేధిస్తున్నాడనే దారుణంగా హత్య
– వివరాలను వెల్లడించిన తాండూరు డీఎస్పీ జి. శేఖర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మిస్టరీ కేసుల్లో.. హత్య కేసుల్లో చాలా చిన్న వస్తువులే కేసులను చేధించేందుకు ఉపయోగపడతాయి. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం గ్రీన్సిటిలో వెలుగులోకి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసులో ఓ క్యారీ బ్యాగ్ సహాయంతో కేసును చేధించారు పోలీసులు. సోమవారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శేఖర్ గౌడ్ పట్టణ సీఐ రాజేందర్ రెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు. వైజాగ్ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్(40) కార్పెంటర్ గా పనిచేసేవాడు. కొన్ని ఏండ్ల క్రితం తాండూరుకు వలస వచ్చి భార్యతో కలిసి జీవించేవాడు. వృత్తి రిత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లి చాలా రోజుల పాటు అక్కడే ఉండేవాడు.
అతని భార్య తాండూరు ప్రాంతంలో ఆశ వర్కర్‌గా పనిచేస్తుంది. లక్ష్మణ్ కుటుంబానికి పాత తాండూరుకు చెందిన అబ్దుల్ ఖలీం అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో లక్ష్మణ్ భార్యతో అబ్దుల్ ఖలీంకు సన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరి విషయం లక్ష్మణ్ కు తెలియడంతో అతని భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో లక్ష్మణ్ తన భార్య ఎక్కడుందో చెప్పాలని ఖలీంపై ఒత్తిడి తీసుకరావడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే అప్పటికే లక్ష్మణ్ భార్య మూడో వ్యక్తితో కలిసి వెళ్లిపోయినట్లు ఖలీం తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని లక్ష్మణ్‌కు చెప్పక పోవడంతో లక్ష్మణ్ ఖలీంపై ఒత్తిడిని ఆపలేదు. లక్ష్మణ్ నుంచి తనకు ఎప్పటికైనా ప్రమాదం ఏర్పడుతుందని ఖలీం అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. గురువారం ఖలీం లక్ష్మణ్‌ను వెంట తీసుకెళ్లి ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఆ తరువాత తన పథకంలో భాగంగా ఖలీం తన స్నేహితుడు అయిన మహమ్మద్ గులాంతో కలిసి లక్ష్మణ్‌ను బైక్ పై అదేరోజు రాత్రి గ్రీన్ సిటీ సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ కూడ మద్యం సేవించిన తరువాత ఖలీం తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. గమనించి భయపడిన ఖలీం స్నేహితుడు గులాం అక్కడి నుంచి పరారయ్యాడు. గులాం వెళ్లిన వెంటనే ఖలీం కత్తితో లక్ష్మణ్ పై దాడి చేసి హత్య చేశాడు. కత్తిని పొదల్లో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
క్యారీ బాగ్ ద్వారా హంతకుడి గుర్తింపు
మరుసటి రోజు శుక్రవారం ఉదయం గ్రీస్ సిటీలో హత్య జరిగిన సంఘటనను పోలీసులు సందర్శించి పరిశీలించారు. సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ మృతుని వివరాలను ఆరా తీశారు. క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు సంఘటన స్థలంలో లభించిన క్యారీ బ్యాగ్ ఆధారంగా విచారణ చేపట్టారు. స్థానికంగా క్యారీ బ్యాగ్ విక్రయించిన ఓ దుకాణంలో ఆరా తీయగా నిందితుడు ఖలీంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అదుపులోకి తీసుకుని విచారించగా ఖలీం నేరాన్ని అంగీకరించాడు. ఈ మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకోవడం కాకుండా హత్య చేసిన ఆయుధాన్ని కూడ స్వాదీనం చేసుకున్నారు.
నిందితున్ని కోర్టులో హాజరు పరిచి సోమవారం రిమాండుకు తరలించినట్లు డీఎస్సీ శేఖర్ గౌడ్ వెల్లడించారు. అదేవిధంగా నిందితున్నిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు హత్య కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యహరించిన కానిస్టేబుల్ అంజద్, షబ్బీర్, శివ, సాయప్ప, ముణ్యప్పలను డీఎస్పీ అభినందించి రివార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ రాజేందర్ రెడ్డితో పాటు ఎస్ఐ వేణుగోపాల్, సిబ్బంది పాల్గొన్నారు.



