ఆర్టీసీలో ల‌గేజీపై మోత‌..!

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఆర్టీసీలో ల‌గేజీపై మోత‌..!
– ఎల్లుండినుంచి పెంచిన చార్జీల అమ‌లు
– ప్ర‌క‌టించిన తెలంగాణ ఆర్టీసీ
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఆర్టీసీని లాభాల బాట‌లో న‌డిపేందుకు చార్జీల పెంపు సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌యాణాకుల రవాణా చార్జీల‌ను పెంచిన ఆర్టీసీ తాజాగా ప్ర‌యాణికులు తీసుకెళ్లే ల‌గేజీల చార్జీల‌ను పెంచేసింది. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. ప‌ల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బ‌స్సుల్లో పెంచిన ధ‌ర‌ల‌ను కూడ నిర్దారించింది. ఎల్లుండి నుంచి అన‌గా 22 నుంచి పెంచిన ల‌గేజీ చార్జీలు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది. పెంచిన ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే గతంలో పల్లెవెలుగు లో 25 కి.మీ దూరానికి రూ.1 వసూలు చేయగా.. ఇప్పుడు రూ.20 వసూలు చేయనున్నారు. అలాగే ఎక్స్ ప్రెస్ ఇతర బస్సులలో 25 కి. మీ లకు 2 రూపాయలు ఉండగా ఇప్పుడు 50 రూపాయలు వసూలు చేయనున్నారు.

యూనిట్ల ప‌ద్ద‌తిలో చార్జీలు
అయితే బస్సులో తరలించే వివిధ వస్తువులను మూడు యూనిట్లు గా గుర్తించి ఈ ఛార్జీలను ప్రజల నుంచి ఆర్టీసీ వసూల్ చేయనుంది. అందులో టైర్లు.. 3 యూనిట్లుగా, టీవీ, ఫ్రిజ్, సైకిల్, 2 యూనిట్లుగా, 25 లీటర్ల ఖాళీ క్యాన్, ఖాళీ బ్యాటరీ, టేబుల్ ఫ్యాన్, కంప్యూటర్ మానిటర్ , సీపీయూ ను 1 యూనిట్ గా పరిగణించి ఛార్జీలు వసూల్ చేస్తారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో బస్సులు సుదూర ప్రాంతాలకు లగేజీ తో ప్రయాణించే ప్రయాణికులకు మరింత భారం పెరగనుంది.